Snake Venom Antibodies By IISC Bangalore : పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలో విడుదలయ్యే ప్రాణాంతకర విష పదార్థాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. ఈ కీలక పరిశోధనలో అమెరికాకు చెందిన స్కిప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యులయ్యారు. ఈ పరిశోధనకు హెచ్‌ఐవీ, కొవిడ్-19 వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ప్రాతిపదికగా నిలిచింది.
కింగ్ కోబ్రా సహా విష సర్పాల కాట్లకు చెక్!
తమ సింథటిక్ యాంటీబాడీ తాచుపాము, నాగుపాము (కింగ్ కోబ్రా), కట్లపాము, బ్లాక్‌మాంబా లాంటి సర్పాల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీబాడీలను తయారుచేయడానికి అవకాశం ఏర్పడుతుంది.