PM Modi Hosting 2036 Olympics :2036 సంవత్సరంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులను దక్కించుకునేందుకు భారత్ సర్వశక్తులు ఒడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా భారత్‌లో క్రీడా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వివరాలను వెల్లడించారు. "ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్ని రంగాలు పుంజుకుంటాయి. వాటి వల్ల అథ్లెట్లకు ఉత్తమమైన సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వస్తాయి" అని ప్రధాని చెప్పారు.
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం: ప్రధాని మోదీ - PM MODI HOSTING 2036 OLYMPICS
ఒలింపిక్స్ నిర్వహణతో భారత క్రీడా రంగం కొత్త శిఖరాలకు- 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
![2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం: ప్రధాని మోదీ Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2025/1200-675-23423112-thumbnail-16x9-modi.jpg)
Published : Jan 28, 2025, 8:46 PM IST
|Updated : Jan 28, 2025, 8:58 PM IST
"దేశంలోని అథ్లెట్లు, క్రీడాకారుల సామర్థ్యాలను పెంచడంపై మేం ఫోకస్ పెట్టాం. తప్పకుండా వారందరికీ దన్నుగా నిలుస్తాం. దేశ వికాసానికి దోహదపడే కీలకమైన విభాగంగా మేం క్రీడలను పరిగణిస్తున్నాం" అని మోదీ పేర్కొన్నారు. "ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావనను బలోపేతం చేసే గొప్ప మాధ్యమం క్రీడలు" అని ఆయన తెలిపారు. 2023 సంవత్సరంలో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) సమావేశంలోనే 2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ ఆసక్తిని వ్యక్తం చేసింది. భారత ఒలింపిక్ సంఘం (IOA) చేసిన ఈ ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నమోదు చేసుకుంది. ఆతిథ్య దేశం ఎంపికపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది.
క్రీడాస్ఫూర్తితో యూసీసీని అమలు చేయాలి : ప్రధాని
సోమవారం (జనవరి 27) నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై ప్రధాని మోదీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒక రోజు క్రితమే ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన యూసీసీ విషయంలోనూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఎందుకంటే క్రీడల్లాగే యూసీసీ కూడా ఎవరిపైనా వివక్షకు తావు ఇవ్వదు" అని ప్రధాని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం యూసీసీని అమల్లోకి తేవడం అనేది చారిత్రక నిర్ణయమని ఆయన కొనియాడారు. ఇందుకోసం రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు మోదీ అభినందనలు తెలిపారు. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, సహ జీవన సంబంధాలు వంటి విషయాల్లో సమాజంలోని అన్ని వర్గాల వారికి ఒకే విధమైన చట్టాలను అందించడమే యూసీసీ ప్రత్యేకత. బాల్య వివాహాలు, బహు భార్యత్వం వంటి వాటిని యూసీసీ నిషేధించింది.