తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారం - Hemant Soren Sworn As Jharkhand CM

Hemant Soren Sworn In As Jharkhand CM : ఝార్ఖండ్​ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. చంపయీ సోరెన్ సీఎంగా రాజీనామా చేసిన నేపథ్యంలో హేమంత్​ సోరెన్​ను సభాపక్ష నేతగా కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 4:57 PM IST

Hemant Soren Sworn In As Jharkhand CM
Hemant Soren Sworn In As Jharkhand CM (ANI)

Hemant Soren Sworn In As Jharkhand CM :ఝార్ఖండ్​ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్​ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సోరెన్ చేత ప్రమాణం చేయించారు.
అంతకుముందు గవర్నర్​, ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్​ సోరెన్​ను ఆహ్వానించారు. తేదీ, సమయం చెప్పాలని కోరారు. అయితే ముందుగా జులై 7న హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారం చేస్తారని ఓ జేఎమ్​ఎమ్​ నేత తెలిపారు. అనంతరం గురువారమే హేమంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్​ ఠాకూర్ చెప్పారు.

హేమంత్​ సోరెన్​ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో, బుధవారం ఉదయం జేఎమ్​ఎమ్​ సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా చంపయీ సోరెన్‌ నివాసంలో సమావేశమయ్యారు. హేమంత్‌ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హేమంత్​ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం చంపయీ సోరెన్, గవర్నర్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. అనంతరం హేమంత్​ సోరెన్​,​ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్​ను కోరారు.

ఇదీ కేసు
ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో 8.86 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం విషయంలో హేమంత్​ సోరెన్​పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. అధికారిక రికార్డులు తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో బెయిల్‌ కోసం సోరెన్‌ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. లోక్​సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బెయిల్‌ ఇవ్వాలని సోరెన్​ సుప్రీం కోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. చివరకు ఆయనకు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అయిదు నెలల తర్వాత జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి సోరెన్ విడుదల​ అయ్యారు.

అయితే జనవరిలో ఆయన్ను ఈడీ అరెస్ట్​ చేయడానికి ముందే హేమంత్‌ తన పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య 2024 ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

సుప్రీంలో బెయిల్‌ను సవాల్​ చేయనున్న ఈడీ
ఇదిలా ఉండగా, హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సెలవుకాల పిటిషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details