Hemant Soren Likely To Return As Jharkhand CM :ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆయనకు లైన్ క్లియర్ అయ్యినట్లే. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను సభా పక్షనేతగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ నివాసంలో జరిగిన భేటీలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్, భార్య కల్పనతో పాటు ఝార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్మీర్ సహా కూటమి నేతలందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో తమ శాసనసభా పక్ష నేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఎమ్మెల్యేలు తెలిపారు. చంపయ్ సోరెన్ స్థానంలో హేమంత్ సోరెన్‌ను సీఎంగా ఎన్నుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ తెలిపాయి. హేమంత్ సోరెన్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఝార్ఖండ్‌కు 13వ ముఖ్యమంత్రి అవుతారు.
బెయిల్‌పై వచ్చి!
హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించడం ద్వారా అక్రమ ఆదాయాన్ని సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఆ నేపథ్యంలో ఆయన్ను ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. దీనితో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎదురుదెబ్బలు తగిలాయి. తాజాగా ఝార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ ఇచ్చింది. దీనితో దాదాపు ఐదు నెలల తర్వాత జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. జనవరి 31న ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఝార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ శకం ముగిసిందని, కుటుంబ ఆధారిత పార్టీలో వేరే వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు ఉండదని భాజపా ఎంపీ నిష్కాంత్ దూబే ట్వీట్ చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత ఫిబ్రవరి 2న ఝార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఆయన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామాను సమర్పించారు.