Hemant Soren ED :భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులోతనపై జరిపిన ఈడీ విచారణను కుట్రగా అభివర్ణించారు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. ఈడీ తనపై కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈడీ దాడులకు తాను భయపడననని తన నివాసం వెలుపల ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 'నాపై కుట్ర జరిగింది. అయితే కుట్రదారుల శవపేటికకు చివరి మేకు మేమే వేస్తాము. నేను భయపడను. మీ నాయకుడు మొదట బుల్లెట్లను ఎదుర్కొంటాడు. మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతాడు. మీ అచంచలమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలుస్తా' అని హేమంత్ సోరెన్ తెలిపారు.
అంతకుముందు భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్-ED అధికారులు శనివారం ప్రశ్నించారు. ఆదివారం మరోసారి హేమంత్ సోరెన్‌ను విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు సోరెన్ అధికార నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులకు 7గంటలకు పైగా ప్రశ్నించారు. ఈడీ అధికారులు సోరెన్ ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.