Heatwave In North India :ఉత్తరాదిలో అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతుండగా, ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు ముంచెత్తాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెల్సియస్ దాటుతున్నాయి. వడగాలులతో ప్రజలు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. బిహార్‌లో అత్యధికంగా మృత్యువాతపడ్డారు. ఇందులో పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
నాగ్‌పుర్‌లో నిప్పుల వర్షం
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో శుక్రవారం నిప్పుల వర్షం కురిసినట్లైంది. ఎండ వేడి ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు సమాచారం. అధికార యంత్రాంగం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే హడలిపోయారు. ఇళ్లలో ఉన్నా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి.
బిహార్‌లో 94మంది మృతి
వేడిగాలుల కారణంగా బిహార్‌లో గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో 14మంది చనిపోయారు. అందులో 10మంది పోలింగ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువమంది భోజ్‌పుర్ జిల్లాలో మరణించినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య 94కు చేరింది. మరోవైపు, వేడి గాలుల కారణంగా 300మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో చేర్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఇంటికి నుంచి బయటక రావొద్దని హెచ్చరిస్తున్నారు. బిహార్‌లో ఔరంగాబాద్‌లోనూ భానుడు ప్రతాపం చూపించాడు. గురువారం ఇక్కడ 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 19మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
13మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో వడదెబ్బతో 13మంది పోలింగ్ సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 23మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఇక సోన్‌భద్ర జిల్లాలో మరో ముగ్గురు పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన మరో 8మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు తెలిపారు.