Hathras Stampede Case Updates :ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబాకు రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ ఆశ్రమం ఉంది. అక్కడ కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. వారిలో కొందరు భోలే బాబా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. భోలే బాబా వల్లే తన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పుకొచ్చారు ఒక మహిళ. హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు భోలే బాబాకు సంబంధం లేదని మరొకరు అన్నారు. ఓవైపు భోలే బాబాపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు భక్తులు ఆయనపై సానుకూల ధోరణిని కలిగి ఉన్నారు.
అల్వార్‌లోని ఖేర్లీ గ్రామానికి సమీపంలోని సహజ్పుర్లో భోలే బాబా ఆశ్రమం ఉంది. ఇక్కడకి భోలే బాబా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కొవిడ్ మహమ్మారి సమయంలో బాబా ఇక్కడే ఉండేవారని ఆశ్రమ సేవకులు చెప్పారు. కాగా, భోలే బాబా హాథ్రస్లో నిర్వహించిన సత్సంగ్‌లో సహజ్పుర్కు చెందిన కొందరు భక్తులు హాజరయ్యారు. వారు హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై పలు విషయాలను పంచుకున్నారు. సత్సంగ్ ముగియగానే భోలే బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారని సహజ్పుర్కు చెందిన ప్రత్యక్ష సాక్షి లఖో దేవి తెలిపారు. ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పారు. సత్సంగ్‌కు భారీగా భక్తులు హాజరవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని, వేడి కారణంగా చాలా మంది చనిపోయారని పేర్కొన్నారు.
'సత్సంగ్ పొలంలో జరిగింది. పొలంలో నుంచి రోడ్డు ఎక్కేందుకు భక్తులు ప్రయత్నించారు. అయితే రోడ్డు, పొలం కన్నా చాలా ఎత్తులో ఉంది. పొలాల్లో బంకమట్టి ఉండడం వల్ల తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేను బురదలో కూరుకుపోయేదాన్ని. కానీ నా కుమార్తె నన్ను రక్షించింది. భోలే బాబాను హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు' అని లఖో దేవి ఆరోపించారు.
'భోలే బాబా నా గాయాన్ని నయం చేశారు'
తన తలకు కొన్నాళ్ల క్రితం గాయమైందని భోలే భక్తురాలు సునీత చెప్పారు. భరత్‌పుర్, మధురలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందినా అది తగ్గలేదని చెప్పుకొచ్చారు. భోలే బాబా ప్రసంగం విన్న తర్వాత తల గాయం నుంచి ఉపశమనం పొందానని తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని అన్నారు. హాథ్రస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి భోలే బాబాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా, 2005 నుంచి తనకు భోలే బాబాతో అనుబంధం ఉందని ఖేర్లీ నివాసి మంగతురామ్ తెలిపారు. ఆయన మంచి మాటలు నచ్చి అనుచరుడిగా మారానని చెప్పుకొచ్చారు. భోలే బాబా ప్రసంగంలో మానవత్వం ఉంటుందని అన్నారు. భోలే బాబా ప్రసంగం కపటత్వానికి దూరంగా ఉంటుందని పేర్కొన్నారు.