తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్జిట్​ పోల్స్ తారుమారు- హరియాణాలో బీజేపీకే జై- కాంగ్రెస్​కు బిగ్ షాక్!

హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయం!- ఎగ్జిట్​పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ అధిక్యం

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Haryana Election Result
Haryana Election Result (ETV Bharat, Getty Image)

Haryana Election Result 2024: హరియాణాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చినా కాంగ్రెస్ తర్వాత వెనుబడి రెండో స్థానానికే పరిమితమైంది.

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో కాంగ్రెస్​ 50 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్​ అంచనా వేశాయి. బీజేపీకి 20-30 మధ్యలో సీట్లు వస్తాయని తెలిపాయి. ఇక ఈ ఎన్నిక్లలో బీజేపీ హ్యాట్రిక్​కు బ్రేక్ పడుతుందని అని అంతా అనుకున్నారు. కానీ ఫలితాల ట్రెండ్ మొత్తం మారిపోయింది. హస్తాన్ని వెనక్కి నెట్టి మరి బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. అధికార బీజేపీపై అనుకున్నంత ప్రజా వ్యతిరేకత లేదనే విషయం తెలుస్తోంది.

వారి ప్రభావం అంతంతే!
రైతు చట్టాల వ్యతిరేక నిరసనలు, రెజ్లర్స్ ఆందోళనలు ఈ సారి బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తాయని భావించారు. వినేశ్ ఫొగాట్, పునియా రెజ్లర్లు కూడా బీజేపీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేరారు. అయినా అవన్నీ బీజేపీపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రజలు కమలదళానికే జై కొట్టారు. మరోవైపు హరియాణా జాట్​ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఎవరికి మద్దతుగా నిలిస్తే ఆ పార్టీ విజయం సాధించం ఖాయం. అయితే పదేళ్లుగా బీజేపీ మద్దతుగా నిలిచారు. కానీ ఇటీవల బీజేపీపై జాట్​లు తీవ్ర కోపంతో ఉన్నారు. బీజేపీ ఈ ఏడాది మార్చిలో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్థానంలో నాయబ్‌ సింగ్‌ సైనీని పీఠంపై కూర్చొబెట్టింది. ఇది కూడా బీజేపీపై వ్యతిరేక చూపించడానికి కారణమైంది. అదే విషయం గత లోక్​సభ ఎన్నికల్లోనూ కనిపించింది. శాసనసభ ఎన్నికల్లో అదే కొనసాగి, కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని భావించారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఎన్నికల డేటా అప్​డేట్​లో జాప్యం
మరోవైపు హరియాణా ఎన్నికల డేటా అప్​డేట్​లో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. కచ్చితమైన గణాంకాలను అప్​డేట్​ చేసేలా అధికారులను ఆదేశించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్​కు ఓ లేఖ రాశారు. 9-11 గంటల మధ్యలో ఫలితాలను అప్​డేట్​ చేయడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికల మాదిరగానే హరియాణా విషయంలోనూ ఈసీ ట్రెండ్స్​ను నిదానంగా అప్​డేట్ చేస్తుందని తెలిపారు. తప్పుదోవ పట్టించే ట్రెండ్స్​ను షేర్ చేసేలా పరిపాలన యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందా అంటూ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details