తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్​- జులానా నుంచి పోటీ- 31మందితో కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్​ - Vinesh Phogat Haryana Elections

HARYANA ASSEMBLY ELECTIONS 2024 : శుక్రవారమే పార్టీలోకి చేరిన వినేశ్​ ఫొగాట్​ను హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్. జులానా నుంచి పోటీ చేస్తున్నట్లు విడుదల చేసిన తొలి జాబితాలో పేర్కొంది.

source Associated Press and ETV Bharat
VINESH PHOGAT HARYANA ASSEMBLY ELECTIONS 2024 (source Associated Press and ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 10:45 PM IST

Updated : Sep 7, 2024, 7:26 AM IST

HARYANA ASSEMBLY ELECTIONS 2024 : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ పోటీ చేయనున్నారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే వినేశ్ ఫొగాట్​తో పాటు బజరంగ్ పునియా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగింది. బద్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చర్చ సాగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన జాబితాతో అతడి పేరు లేదు. అలానే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం భూపేంద్ర సింగ్‌ హుడా ఘర్హి అస్లెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

31 మందితో అభ్యర్థుల జాబితా
శుక్రవారం రాత్రి హరియాణా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే 31 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్‌ హుడా, ఉదయ్‌ భాన్, వినేశ్‌ ఫొగాట్‌లు ఉన్నారు. ఇక స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా శుక్రవారమే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరూ హస్తం కండువా వేసుకున్నారు. అంతకు ముందు రెజ్లర్లు, పార్టీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అంతేకాదు, పార్టీలో చేరడానికంటే ముందే వ్యక్తిగత కారణాలతో భారత రైల్వేలోని తమ ఉద్యోగాలకు వినేశ్, బజ్‌రంగ్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫొగాట్‌కు కాంగ్రెస్‌ జులానా శాసనసభ టికెట్‌ ఇచ్చింది. బజ్‌రంగ్‌ పునియాను ఆల్‌ ఇండియా కిసాన్‌ కాంగ్రెస్‌ (ఏఐకేసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది.

HARYANA ASSEMBLY ELECTIONS 2024 (HARYANA ASSEMBLY ELECTIONS 2024)

రాజకీయ కుట్ర ఉందా?
ఒలింపిక్స్‌ కల చెదిరిన ఘటన వెనక ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా? అని వినేశ్​ను విలేకర్లు ప్రశ్నించారు. "అది నాకు ఎంతో ఉద్వేగపూరితమైన అంశం. దానిపై నేను సవివరంగా మాట్లాడతాను. దానిపై నేను స్పందించే వరకు వేచి ఉండండి" అని అన్నారు. "పారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు దేశమంతా సంబరపడింది. కానీ, ఆ తర్వాత రోజు ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు అందరూ బాధతో కుంగిపోయారు. కానీ, ఒక పార్టీ(బీజేపీను ఉద్దేశించి)కి చెందిన ఐటీ విభాగం మాత్రం సంబరాలు చేసుకుంది" అని బజ్‌రంగ్‌ పునియా సునిశిత విమర్శలు చేశారు.

హరియాణాలో 'ఆప్‌' ఒంటరి పోరు!
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కుదరలేదు. పొత్తులపై ఇరు పార్టీల స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌-ఆప్‌లు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో హరియాణా, దిల్లీ, గుజరాత్‌ల్లో కలిసి పోటీ చేశాయి. ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. కానీ సీట్ల పంపిణీ విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతున్నాయి. 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తుండగా, 7 సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ అంటోంది. మరోవైపు హరియాణాలో పొత్తుపై కాంగ్రెస్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా లేవని ఆప్​ నేత అన్నారు. ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నామని, 50 స్థానాల్లో బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో పొత్తు లేనట్లుగానే కనిపిస్తోంది.

Last Updated : Sep 7, 2024, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details