ADR Report On Haryana Assembly Elections : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండడం వల్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారు. మొత్తం 90 స్థానాలు కలిగిన హరియణా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో దాదాపు సగానికి పైగా అభ్యర్థులు కోటీశ్వరులున్నారు. ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు చేసిన వారిలో 1028 మంది అభ్యర్థుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడీఆర్) విశ్లేషించింది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 538 మంది (52%) కోటీశ్వరులేనని వెల్లడించింది.
అత్యంత సంపన్నులు వీరే
కోటీశ్వరులైన అభ్యర్థుల జాబితాలో 184 మంది స్వతంత్రులు ఉన్నారు. బీజేపీ నుంచి 85 మంది, కాంగ్రెస్ 84, జేజేపీ 46, ఐఎన్ఎల్డీ 34, ఆప్ 52, బీఎస్పీ 18 మంది చొప్పున పోటీలో ఉన్నట్లు నివేదికలో తెలిపింది. హిసార్‌లోని నార్నౌండ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెప్టెన్ అభిమన్యు అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ అత్యధికంగా రూ.491 కోట్లుగా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. సోహ్నా నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి రోహ్తస్ సింగ్ ఆస్తుల విలువ రూ. 484 కోట్లు కాగా, హిసార్ నుంచి బరిలో నిలిచిన సావిత్రి జిందాల్ ఆస్తి విలువ రూ. 270 కోట్లకు పైనే ఉంది.