India's First Women Wrestler Hamida Banu: గూగుల్ డూడుల్ లో కనిపించిన వ్యక్తి హమీదా బాను (Hamida Banu). ఈమె భారత తొలి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. 1940 సంవత్సరంలో క్రీడల్లో పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రోజుల్లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన హమీదా.. ఎంతో మంది పహిల్వాన్‌లను నిమిషాల్లోనే మట్టికరిపించారు. 'అమెజాన్ ఆఫ్ అలీగఢ్'గా పేరొందిన ఆమెకు నివాళిగా నేడు గూగుల్ (Google) ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి గౌరవించింది.
కట్టుబాట్లను దాటి రెజ్లింగ్‌లోకి ఎంట్రీ:1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో హమీదా జన్మించారు. 1940-50 వరకు పది సంవత్సరాల పాటు ఆమె కెరీర్ సాగింది. దాదాపు 300లకు పైగా పోటీల్లో ఆమె విజయం సాధించారు. హమీదా కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఆ కాలంలో అథ్లెటిక్స్‌లోకి ఆడవాళ్లను ఎక్కువగా రానిచ్చేవారు కాదు. అలాంటి కట్టుబాట్లను దాటడమే గాక.. రెజ్లింగ్‌కు ఎంచుకున్నారామె..
నన్ను ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటా:తనను కించపర్చేవారికి ఆటతో గట్టి సమాధానమిచ్చేవారు హమీదా. అంతే కాకుండా.. రెజ్లింగ్‌లో తనను ఓడించే తొలి మగవాడిని పెళ్లి చేసుకుంటానని ఓసారి సవాల్ విసిరారు. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించి కోల్‌కతా, పాటియాలా నుంచి ఇద్దరు పురుష ఛాంపియన్లు ఆమెతో పోటీ పడి ఓడిపోయారు. మూడోసారి.. రెజ్లింగ్‌లో దిగ్గజంగా పేరొందిన బాబా పహిల్వాన్‌తో పోటీ పడగా.. కేవలం 1 నిమిషం 34 సెకన్లలో అతడిని మట్టికరిపించారు హమీదా. సవాల్ సమయంలో ఆమె పెట్టిన షరతు కారణంగా బాబా పహిల్వాన్ ఈ ఓటమి తర్వాత ప్రొఫెషనల్ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 1954 మే 4వ తేదీన ఈ మ్యాచ్ జరిగింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు గుర్తుగా నేడు గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి గౌరవించింది.