తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే- మావోయిస్టులతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు - gn saibaba maoist link case

GN Saibaba Acquitted : మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్​ జీఎన్‌ సాయిబాబాను బాంబే హైకోర్టు(నాగ్​పుర్​ బెంచ్​) నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది.

GN Saibaba Acquitted
GN Saibaba Acquitted

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 12:09 PM IST

Updated : Mar 5, 2024, 8:40 PM IST

GN Saibaba Acquitted :మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవితఖైదు అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్​ సాయిబాబాను బాంబే హైకోర్టు (నాగ్‌పుర్‌ బెంచ్‌) శుక్రవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో అరెస్టయిన మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరలేదు.

'10 ఏళ్ల పోరాటం ఫలించింది'
తన భర్త సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషిగా తేలుస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన భార్య వసంత కుమారి హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పోరాటానికి న్యాయం లభించిందంటూ మంగళవారం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'న్యాయం కోసం చేసిన పోరాటంలో మాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులు, కార్యకర్తలకు చాలా కృతజ్ఞతలు' అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సుప్రీంకు మహా సర్కార్
మరోవైపు ఈ కేసుతో సంబంధమున్న సాయిబాబా సహా మరికొందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం బాంబే హై కోర్టులోని నాగ్​పుర్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పుర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబరులో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది.

అనంతరం 2023 ఏప్రిల్‌లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. వారి అప్పీల్‌పై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు, సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా అరెస్టైన నేపథ్యంలో 2014లో సాయిబాబాను దిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది.

'ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం కావాలి'- సుప్రీంను కోరిన ఎస్‌బీఐ

'మీరేం సామాన్య పౌరుడు కాదు- ఆ మాత్రం తెలియదా?'- ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్

Last Updated : Mar 5, 2024, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details