Gifts For Ram Mandir Ayodhya :అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక కోలాహలమే. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. యావత్‌దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ఈ చారిత్రక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే రాముడు మా ఇంటి దేవుడు అంటూ దేశ విదేశాల నుంచి లెక్కకు మిక్కిలి కానుకలు ఆయనకు సమర్పించారు. అందులో కొన్ని ప్రత్యేకమైన వాటి గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ నుంచి తలుపులు, బంగారు పాదుకలు
అయోధ్య గర్భాలయంలో అష్టధాతువులతో నిర్మించిన 600 కిలోల గంట ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయాన్ని తెల్లటి మకరానా పాలరాతితో తీర్చిదిద్దారు. ప్రధానమైన గర్భాలయ ముఖ ద్వారం, తలుపులు తయారుచేసే అవకాశం హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో వారికి దక్కింది. నాణ్యమైన బర్మా టేకుతో భారీ దర్వాజల్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ ద్వారాలపై బంగారు తాపడం చేశారు.
రాములవారికి పాదుకల్ని సమర్పించే భాగ్యం కూడా తెలుగువారికే దక్కింది. హైదరాబాద్కు చెందిన భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస శాస్త్రి కిలో బంగారుపూత పూసిన 9 కిలోల పాదుకల్ని సమర్పించారు. 41 రోజులపాటు వివిధ క్షేత్రాల్లో దర్శనం అనంతరం అయోధ్యకు తరలించారు.