Gali Janardhan Reddy Joins BJP : కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీని కమల దళంలో విలీనం చేశారు. సోమవారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు తనవంతుగా సాయం చేస్తానని తెలిపారు.
మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకే మళ్లీ బీజేపీలోకి : గాలి జనార్దన్ రెడ్డి
దేశ ప్రయోజనాల కోసమే మళ్లీ తాను బీజేపీలో చేరానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి దేశ ప్రధానిగా చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఎలాంటి షరతులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ టికెట్ ఆఫరేదీ తనకు బీజేపీ నుంచి రాలేదని, తాను కూడా అలాంటివేం అడగలేదని తేల్చి చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా అంకితభావంతో నిర్వర్తిస్తానని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనవంతుగా పాటుపడతానన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించిన 'గాలి'
2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీ కీలక పాత్ర పోషించింది. హరపనహళ్లి, బళ్లారి సిటీ నుంచి బీజేపీ టికెట్లపై పోటీచేసిన తన ఇద్దరు సోదరులు జి.కరుణాకర రెడ్డి, జి.సోమశేఖర రెడ్డిల ఓటమిలో గాలి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బళ్లారి సిటీలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి సోమశేఖర రెడ్డిపై భార్య అరుణ లక్ష్మిని గాలి జనార్దన్ రెడ్డి బరిలోకి దింపారు. దీంతో ఓట్ల చీలిక జరిగి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. ఈ పరిణామాలన్నీ గమనించిన బీజేపీ అధిష్టానం, గాలి జనార్దన్ రెడ్డి తమవైపు ఉంటే వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భావించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకొని చర్చలు జరిపి బీజేపీలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీ విలీనం జరిగేలా చూశారు. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్న శ్రీరాములు ఈసారి బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బళ్లారి, కొప్పళ, విజయనగరం, రాయచూరు జిల్లాల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
ఓటమి నేర్పిన పాఠంతో కొత్త వ్యూహం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో కంగుతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు సరికాదనే భావనకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీతో బీజేపీ సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని కల్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) ను కమలదళం విలీనం చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓట్లను ఏకీకృతం చేయొచ్చని బీజేపీ భావిస్తోంది.