Fund Raising For Abdul Rahim : సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన భారతీయ ఖైదీని విడిపించేందుకు నడుం బిగించారు కేరళ రాష్ట్ర ప్రజలు. ఇందుకోసం ఏకంగా రూ.34కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఇందులో కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 24కోట్ల విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా సౌదీ ప్రభుత్వానికి అందజేసి రహీమ్ను విడుదల చేయించనున్నారు.
కేరళ కొజీకోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ కొన్నేళ్ల క్రితం పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడే డ్రైవింగ్ చేస్తూ ఓ దివ్యాంగ బాలుడి బాగోగులు చూసే పనిలో చేరాడు. అయితే, ఈక్రమంలోనే 2006లో ప్రమాదవశాత్తు ఆ బాలుడి మరణానికి రహీమ్ కారణమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు రహీమ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీనిపై విచారించిన కోర్టు అతడికి 2018లో మరణశిక్ష విధించింది. దీనిపై 2022లో హైకోర్టులో అప్పీల్ చేయగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది. అనంతరం సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించగా కింద స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును వెలువరించారు. దీంతో సుమారు 18 ఏళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.