Farmers Protest Delhi 2024 : కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీకి బయలుదేరిన రైతు సంఘాలను హరియాణా, పంజాబ్ సరిహద్దు ప్రాంతం శంభు వద్ద నుంచి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు, మేకులతో రోడ్డుకు అడ్డుగా పోలీసులు పెట్టిన ఆటంకాలను తొలిగించేందుకు రైతులు ప్రయత్నించారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలిగించేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. బాష్పవాయు గోళాలతో పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడం వల్ల రైతులు పరుగులు పెట్టారు. ఈ పరిణామాలతో శంభు సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు
బాష్ప వాయుగోళాలతో పాటు జలఫిరంగులను కూడా రైతులపైకి ప్రయోగించారు. భారీసంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో శంభు సరిహద్దుకు చేరుకున్న రైతులు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా బాష్ప వాయుగోళాలు జార విడిచారు. అయినా సరే బెదరకుండా ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నాలు కొనసాగించారు. శంభు వద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కిందపడేశారు. మరింత ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించిన కర్షకులపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ప్రస్తుతం శంభు సరిహద్దు వద్దే రైతులకు, పోలీసులకు మధ్య ప్రతిఘటన జరుగుతోంది.
రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రోడ్డు మార్గం ద్వారా కాకుండా పక్కనే ఉన్న పొలాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను బాష్పవాయువు గోళాలతో అడ్డుకుంటున్నారు. ఆటంకాలను అధిగమించి పొలాల ద్వారా దిల్లీ వైపు దూసుకెళ్తున్న కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని జింద్ వద్ద కూడా కర్షకులు ముందుకు వెళ్లకుండా పోలీసు, పారామిలటరీ బలగాలు అడ్డుకుంటున్నాయి. రహదారిపై కాంక్రీటు స్లాబులు, ఇనుప మేకులు, ముళ్ల కంచెలతో అడ్డుకట్ట వేశారు. అయినా వెనక్కి తగ్గని రైతులపై బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు.
చర్చలకు సిద్ధమే
అంతకుముందు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్షణ సమితి సభ్యులు దేశ రాజధానికి ట్రాక్టర్లలో బయలుదేరారు. తాము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండానే దిల్లీ చలో చేపడతామని తెలిపారు. చర్చల్లో కేంద్ర మంత్రుల నుంచి సానుకూల నిర్ణయాలు ఏమీరాలేదన్నారు. రైతుల ఆందోళనను బూచిగా చూపి భద్రత పేరుతో హరియాణా, పంజాబ్ ప్రజలను వేధిస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపించారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దు మాదిరి మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమేనని తెలిపారు.
కేంద్రం స్పందన
సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా కనీస మద్దతు ధరపై చట్టాన్ని తొందరపడి తీసుకురాలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంఎస్పీ గ్యారెంటీకి సంబంధించిన డిమాండ్‌పై రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ నిరసనను అప్రతిష్ఠపాలు చేసే విషయంపై అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించారు. రెండు రౌండ్ల చర్చల్లో కర్షకుల అనేక డిమాండ్లను అంగీకరించామని, కొన్ని అంశాలపై ఇంకా ఒప్పందం కుదరలేదని చెప్పారు.