తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ లెక్క తప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌- హరియాణా, జమ్ముకశ్మీర్​లో అంచనాలన్నీ ఫెయిల్​! - HARYANA JK EXITS POLLS

మళ్లీ బెడిసికొట్టిన ఎగ్జిట్ పోల్స్ - హరియాణా, జమ్ముకశ్మీర్​ ఎన్నికల్లో అంచనాలు తారుమారు

Exit Polls Again Failed
Exit Polls Again Failed (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 7:49 AM IST

Exit Polls Again Failed :ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ వెల్లడైతే ఫలితాల మీద ఒక అంచనాకు వస్తారు. ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని పలు సర్వే సంస్థలు ముందస్తుగానే ఏ పార్టీ, కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తూ ఉంటాయి. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పిన సీట్లకు కొంచెం అటు ఇటూగా తుది ఫలితాలు వస్తుంటాయి. కొన్నిసార్లు వాటి అంచనాలు తలకిందులు కూడా అయ్యే అవకాశాలున్నాయి. అదే ఈ సారి ఎన్నికల్లో జరిగింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చతికిలపడ్డట్లే తాజాగా హరియాణా, జమ్ముకశ్మీర్‌ విషయంలోనూ అదే బాట పట్టాయి.

మొత్తం 90 సీట్లున్న హరియాణాలో కాంగ్రెస్‌ 50కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. బీజేపీ హ్యాట్రిక్​కు బ్రెక్ పడుతుందని,​ 30 సీట్లు దాటితే గొప్ప అన్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్‌ సర్వే కాంగ్రెస్‌కు 50-58 సీట్లు, బీజేపీకు 20-28 సీట్లు ఇచ్చింది. రిపబ్లిక్‌ భారత్‌- మాట్రైజ్‌ సర్వే కాంగ్రెస్‌కు 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తీరా ఫలితాలు చూస్తే బీజేపీ 50 మార్కుకు చేరువై వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్‌ 37 సీట్ల వద్దే ఆగిపోయింది. జమ్ముకశ్మీర్​లోనూ హంగ్​ అసెంబ్లీ ఏర్పాటు అవుతుందని అంచనా వేశాయి. కాంగ్రెస్​ - ఎన్​సీ కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని తెలిపాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటకు కావాల్సిన మెజారిటీని సాధించాయి.

పార్లమెంట్​ ఎన్నికల్లోనూ రివర్స్
ఎన్నికల ఫలితాల్లో రాజకీయ పార్టీల అంచనాలు తారుమారవ్వడమనేది ఇదే తొలిసారి కాదు. కొన్నిసార్లు దారుణంగా ఓడిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ నెగ్గుతుందని చెప్పాయి. చివరకు బీజేపీ గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా సీట్లతో ఆధిక్యం సాధిస్తుందని అంచనా వేయగా, 240 స్థానాలకు పరిమితమైన కమలం పార్టీ మెజారిటీకి అవసరమైన సీట్లను (272) కూడా సొంతంగా సాధించలేకపోయింది.

సెమీ ఫైనల్​ ఎన్నికల్లోనూ!
గతేడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొన్ని చోట్ల ఎగ్జిట్​ పోల్స్ అంచనాలు లెక్క బెడిసికొట్టింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ, ఎగ్జిట్​ పోల్స్‌ మాత్రం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే జరిగింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు తెలిపాయి. కొన్ని సర్వేలు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

  • 2004 లోక్​సభ ఎన్నికల్లో షైనింగ్ నినాదంతో ఎన్​డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో పోటీచేసింది. అప్పట్లో ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ఎన్​డీఏ 240-250 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ వాస్తవానికి 187 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి ఎన్నిస్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఎన్​డీఏ 300 స్థానాలో విజయదుందుభి మోగించింది. ఒక్క బీజేపీయే 272 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమైంది.
  • నోట్ల రద్దు తర్వాత 2017లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ అసెంబ్లీ వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ 325 స్థానాల్లో విజయఢంకా మోగించింది.
  • 2015లో బిహార్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాకూటమికి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల్లో కూటమికి 178 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటమి పాలైంది.
  • 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని సర్వేలు అంచనా వేసినప్పటికీ 70 సీట్లకు 67 స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details