Electoral Bonds SBI :రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు కోర్టుకు వెల్లడించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కోరింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). ఈ మేరకు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చిన గడువును జూన్ 30 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
'మరికొంత సమయం కావాలి'
'2019 ఏప్రిల్ 12 నుంచి 2024 వరకు మొత్తంగా 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశాం. బాండ్లను కొనుగోలు చేసినవారు, అనంతరం వాటిని రిడీమ్ చేసుకున్న వారి వివరాలను మ్యాచ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కోర్టు ఇచ్చిన గడువు మాకు ఏమాత్రం సరిపోదు. అందుకోసమే గడువును పొడిగించాలని కోరుతున్నాం' అని ఎస్‌బీఐ సుప్రీంను కోరింది.
ఎన్నికల బాండ్లపై సుప్రీం సంచలన తీర్పు
దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతనెలలో సంచలన తీర్పును వెలువరించంది. పార్టీలకు రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి అవకాశం కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కింద పేర్కొన్న భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఈ పథకం ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.