Election Code Of Conduct Gold Cash Rules And Regulations :లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు చాలా విషయాలపై పరిమితులు ఉంటాయి. నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలపై ఎన్నో రకాల ఆంక్షలను విధిస్తారు. మరి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎంత నగదు, నగలను మనతోపాటు తీసుకెళ్లొచ్చో ఇప్పుడు చూద్దాం.
ఎలక్షన్స్ టైంలో ఒకరు ఎంత నగదు, బంగారం తీసుకెళ్లవచ్చు?
Rules To Carry Cash In Election : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ పౌరులు ఎలాంటి పత్రాలు లేకుండా రూ.49వేలను తమవెంట తీసుకెళ్లవచ్చు. అయితే రూ.49వేలకు మించి నగదు తీసుకెళ్తే లెక్కలు చెప్పాలి. ఒకవేళ సరైన లెక్కలు చెప్పకపోతే ఆ మొత్తాన్ని సీజ్ చేస్తారు. అదేవిధంగా రూ.50వేల విలువైన బంగారం లేదా ఏదైనా ఆభరణాన్ని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
నగదు, బంగారం, బహుమతులకు ఎలాంటి పత్రాలు అవసరం?
ఎన్నికల సమయంలో రూ.49వేలకు మించి తీసుకెళ్లే సమయంలో పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసిన బ్యాంక్ లేదా ఏటీఎం స్లిప్‌ను మీ దగ్గర ఉంచుకోవాలి. అంతేకాకుండా డబ్బును ఎక్కడ ఖర్చుచేస్తారో అందుకు సంబంధించిన పత్రాలు మీ వెంట ఉండాలి. ఒక తులం లేదా రూ.50వేల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని తీసుకెళ్తుంటే దానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపించాలి.
రూ.10లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే?
ఎన్నికల కోడ్ సమయంలో మీరు అత్యవసర పని కోసం రూ.10లక్షలు తీసుకుని ప్రయాణించవచ్చు. ఉదాహరణకు మీరు పెళ్లి కోసం లేక ఆస్పత్రి ఖర్చు కోసం రూ.10లక్షలు తీసుకెళ్తే, అందుకు సంబంధించిన పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. హాస్పిటల్ బిల్లు లేదా పెళ్లి కార్డు వంటివి చూపించాల్సి ఉంటుంది. వీటిని చూపించిన తర్వాత, చెక్‌పోస్టు బృందాలు లేదా పోలీసులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.
నగదు లేదా నగలు స్వాధీనం చేసుకుంటే ఎలా?
EC Code Of Conduct Rules :సరైన పత్రాలు సమర్పించని సమయాల్లో డబ్బును లేదా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఎన్నికలు ముగిసిన అనంతరం తగిన ఆధారాలు అందించిన తర్వాతే ఆ సీజ్ చేసిన వాటిని మీకు అందిస్తారు. అయితే రూ.10లక్షల కంటే ఎక్కువ నగదు ఉంటే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. విచారణ అనంతరం మీ డబ్బు తిరిగి ఇస్తుంది.