Ramachandra Gopalakrishna Temple : కైలాసంలోని శివుడికి తులసీదళం, వైకుంఠంలోని మహా విష్ణువుకు బిల్వపత్రం సమర్పించడమనేది కార్తిక మాసంలోని ప్రత్యేకత. ఆత్మను పరమాత్మతో నివేదించి యోగ నిద్రలోని విష్ణువును మేల్కొల్పడంలో దీపారాధనే కీలకంగా ఉంటుంది. మహారాష్ట్రలోని పండరీపూర్‌ను పోలిన విధంగా ఆదిలాబాద్‌లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నాలుగు శతాబ్దాలుగా ప్రత్యేకంగా జరిగే కాగడ హారతి గురించి తెలుసుకుందాం.
శతాబ్దాల చరిత్ర : ఆదిలాబాద్‌లోని ప్రాచీన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ వినాయకుడు, విష్ణువు, గోపాలకృష్ణుడు, సీతారామ లక్ష్మణులు, ఆంజనేయస్వామి, శివలింగం, సతి అనసూయ, దుర్గామాత ప్రతిమలు కొలువైన ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ కొలువైన విష్ణుమూర్తిని యోగ నిద్ర నుంచి మేల్కోల్పడానికి కోజాగిరి పౌర్ణమి నుంచి కార్తిక పౌర్ణమి వరకు కాగడ హారతిని వెలిగిస్తారు. సూర్యోదయానికి ముందే భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహిస్తారు.
ఆదిలాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు బిల్వపత్రం, తులసీదళం, ఉసిరి, గుమ్మడి, మంగళహారతులతో తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుంటారు. ఏ రోజుకారోజు ప్రత్యేకంగా తయారు చేసిన వత్తులను నెయ్యిలో నుంచి తీసి భక్తులందరికీ పంచిపెడుతుంటారు.
విష్ణువు కైలాసానికి, శివుడు వైకుంఠానికి : నూతనంగా తయారు చేసిన వత్తుల్లోని రెండు మొనలను ఒకే వైపు చేసి వెలిగించడం ఇక్కడి మరో విశిష్టత. అందులో ఓ మొనను ఆత్మగా, మరో మొన పరమాత్మగా ప్రజలు భావిస్తారు. కార్తిక పౌర్ణమి రోజు విష్ణువు కైలాసానికి, శివుడు వైకుంఠానికి వెళ్తారని ఓ నమ్మకం ఉంది. ప్రతిరోజు వేకువజామున ప్రారంభమయ్యే ఈ వేడుక సూర్యోదయానికి ముందే ముగుస్తుంది. ఈ మాసంలో దేవుడికి హారతి ఇవ్వడం ద్వారా సకల శుభాలు, ప్రయోజనాలు కలుగుతాయనేది భక్తుల అచంచల విశ్వాసం.
ఏడాదంతా శుభాలే
కార్తిక మాసంలో దీపారాధన చేయడంతో పాటు కార్తిక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే ఏడాదంతా శుభాలే కలుగుతాయి. యోగ నిద్రలోని శివకేశవులను మేల్కొల్పడం, కాగడ హారతితో ఆరాధించడం పుణ్యఫలం. - ప్రవీణ్‌శర్మ, వేద పండితులు