తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరు జిల్లాలో జీరో పోలింగ్- 20మంది ఎమ్మెల్యేలు సహా 4లక్షల మంది ఓటింగ్​కు దూరం- అందుకోసమేనట! - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Election Boycott In Nagaland : లోక్​సభ ఎన్నికలు మొదటి దశలో నాగాలాండ్‌లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్‌ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు.

Boycotted Election In Nagaland
Boycotted Election In Nagaland

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 8:20 AM IST

Election Boycott In Nagaland : సార్వత్రిక ఎన్నికలు మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. బంగాల్‌, మణిపుర్‌లో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. కానీ నాగాలాండ్​లో మాత్రం దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్​లోని 6 జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు.

20 మంది ఎమ్మెల్యేలూ కూడా దూరం
నాగాలాండ్‌లోని ఆ ఆరు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా, ఈ ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఉన్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ సమయం కేటాయించినప్పటికీ ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం
ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (ENPO)గా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని చెబుతోన్న ఈఎన్‌పీవో ఏప్రిల్‌ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్‌ పాటించాలని ఇటీవల ప్రకటించింది. దీంతో పోలింగ్‌ రోజున పోలింగ్​ కేంద్రాలకు వెళ్లకుండా లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు. అయినప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు.

ఈఎన్​పీవోకు పోకాజ్​ నోటీసులు
ఎన్నికల వేళ బంద్‌కు పిలుపునివ్వడాన్ని నాగాలాండ్‌ ఎన్నికల అధికారులు తప్పుపట్టారు. ఈఎన్‌పీవోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వయసన్‌ ఆర్‌ పేర్కొన్నారు. దీనిపై ఈఎన్‌పీవో అధ్యక్షుడు సపికియు సంగ్తం స్పందిస్తూ నోటీసుల్లో ఈసీ పేర్కొన్న సెక్షన్‌ ఈసందర్భంలో వర్తించదన్నారు. తాజా పరిణామంపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, ఫ్రంటియర్‌ నాగాలాండ్‌ టెరిటరీ (FNT) స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఇప్పటికే సిఫార్సు చేశామన్నారు. అయితే, 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు వేయకపోవడం వల్ల వారిపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, తాము ఘర్షణ కోరుకోవడం లేదని సీఎం రియో స్పష్టంచేశారు.

డిమాండ్లు నేరవేర్చాలని ఓటు వేసిన బధిరులు
జమ్ముకశ్మీర్​ డోడా జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు సగం మంది బధిరులే ఉన్నారు. చాలా మంది తమ వైకల్యం అడ్డుకాదంటూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో అనేక మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అదే మంచు పర్వతాల్లో ఉన్న ధడ్కాహి గ్రామం.

ఈ గ్రామంలో గుజ్జర్లు నివసిస్తున్నారు. ఇది ఉధంపుర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఇక్కడ 105 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 55 కుటుంబాల్లో కనీసం ఒకరు పుట్టుకతో మూగ లేదా చెవుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో మొత్తం 84 మంది బధిరులు ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది పదేళ్లలోపు చిన్నారులే. అందుకే ఈ గ్రామానికి 'సైలెంట్‌ విలేజ్‌'గా పేరుపడింది. ఇక్కడ ఈ తరహా పరిస్థితులను 1939లోనే గుర్తించారు.

డిమాండ్లు నెరవేర్చకపోతే ఎన్నికల బహిష్కరణ
అయితే తాజా ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన బధిరులు, నేతలు తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారనే చిన్న ఆశ ఉందన్నారు. రోడ్డు మార్గం, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, ఆరోగ్యకేంద్రంలో వైద్యులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పుట్టుకతో సమస్యను ఎదుర్కొంటున్న తమకు ఓ బధిర పాఠశాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్‌లో జరిగే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించడం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికల తొలిదశ ఓటింగ్ ప్రశాంతం- 62.37% పోలింగ్ నమోదు - Lok Sabha Elections 2024

ఒకే ఒక్క ఓటరు కోసం అడవిలో 18కి.మీ ప్రయాణం- శివలింగం భావోద్వేగం! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details