తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టువీడిన శిందే? డిప్యూటీ పోస్ట్​కు ఓకే! 'మహా' సీఎంగా ఫడణవీస్​!!

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఖాయమైనట్లే- ఏక్‌నాథ్‌ శిందే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం!

Maharashtra New CM Suspense
Maharashtra New CM Suspense (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Maharashtra New CM Suspense :మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లే కన్పిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ రాష్ట్ర పగ్గాలు అందుకోవడం ఖాయమైనట్లు సమాచారం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని, శిందేతో పాటు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ కూడా ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపాయి. బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని, హోంశాఖను కేటాయించాలని శిందే పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని పరిశీలకులుగా బీజేపీ అధిష్ఠానం నియమించింది.

అయితే ఎన్డీఏ నేత రామ్‌దాస్‌ అథవాలే తాజాగా ఏక్‌నాథ్‌ శిందేతో చర్చలు జరిపినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయనకు నచ్చజెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు శిందే కూడా సుముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు మరోసారి సీఎం పదవిని ఇచ్చేందుకు మహాయుతిలోని బీజేపీ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేయకపోవడంపై శిందే కలత చెందిన మాట వాస్తవమేనని ఆఠ్‌వలే అన్నారు. అయినప్పటికీ, బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు కనిపించట్లేదన్నారు.

శిందే ఎదుట ప్రస్తుతం మూడు దారులున్నాయని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం లేదంటే మహాయుతి కూటమి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం, అది కూడా నచ్చకపోతే.. కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమేనని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గానూ మహాయుతి కూటమి 230 చోట్ల విజయం సాధించిన సంగతి తెలిసిందే. భాజపా 132 స్థానాలను దక్కించుకోగా, శివసేన 57, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది.

మెరుగుపడని శిందే ఆరోగ్యం!
మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే కొన్ని రోజులుగా జ్వరం, గొంతునొప్పితో ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు శిందే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఠాణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్‌ చేయించుకున్నారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details