తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 7:50 PM IST

Updated : Mar 16, 2024, 8:08 PM IST

ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే'- క్లారిటీ ఇచ్చిన సీఈసీ!

EC On Jammu And Kashmir Assembly Election : లోక్​సభ ఎన్నికల సమయంలోనే జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించవచ్చనే ఊహాగానాలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు.భద్రతా కారణాల దృష్ట్యా ఇది ఆచరణీయం కాదని తెలిపారు.

EC On Jammu And Kashmir Assembly Election
EC On Jammu And Kashmir Assembly Election

EC On Jammu And Kashmir Assembly Election :లోక్​సభ ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగవచ్చని ఊహాగానాలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనికి సంబంధించి ఎదురైన ప్రశ్నకు భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ పోలింగ్‌ తర్వాతే అక్కడ ఈ ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ ఏకకాల ఎన్నికలు నిర్వహించడం ఆచరణీయం కాదని తెలిపారు.

''అక్కడ ప్రతీ అభ్యర్థికి భద్రత అందించడం అవసరం. దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ ఇది సాధ్యం కాదు. మరోవైపు జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పాకిస్థాన్‌ ఆక్రమిత ప్రాంతంలోని 24 సీట్లు సహా మొత్తం 107 స్థానాల ప్రస్తావన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్‌ కమిషన్ నివేదికలో సీట్ల సంఖ్యలో మార్పు వచ్చింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం''

--రాజీవ్​ కుమార్, ఎన్నికల ప్రధాన అధికారి

''స్థానికంగా అన్ని పార్టీలు కూడా లోక్​సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. కానీ పాలనా యంత్రాంగం మాత్రం ఏకకాలంలో నిర్వహించలేమని చెప్పింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 10, 12 మంది చొప్పున మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతీఒక్కరికీ భద్రత అందించాలి. ప్రస్తుతం అది సాధ్యం కాదు" అని తెలిపారు. అయితే లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన వెంటనే అక్కడ పోలింగ్‌ నిర్వహించే విషయానికి కట్టుబడి ఉన్నామని సీఈసీ చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని గతంలో కేంద్రం సైతం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబరులో ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు చేపట్టాలని సూచించింది.

ఐదు దశల్లో ఎన్నికలు
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్​లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఒక్కో దశలో ఒక నియోజకవర్గం చొప్పున పోలింగ్​ జరగనుందని తెలిపింది. ఈసీ చెప్పిన వివరాల ప్రకారం, మొదటి దశలో ఏప్రిల్​ 19న ఉధంపుర్ లోక్​సభ స్థానానికి ఎన్నికల జరగుతాయి. ఆ తర్వాత జమ్ము పార్లమెంట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న, అనంత్​నాగ్​లో మే7, శ్రీనగర్​లో మే13, బారాముల్లాలో మే20న ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకశ్మీర్​లో మొత్తం 86.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 42.58 లక్షలు ఉన్నారు. ఇక ఇతరులు 161 మంది ఉన్నారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ వచ్చేసింది : మోదీ
ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తేదీలను EC ప్రకటించిందన్న మోదీ, ఈ ఎన్నికలకు NDA పూర్తిగా సిద్ధమయ్యిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా తెలిపారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాల్లో అందించిన సేవల ట్రాక్‌రికార్డుతో ప్రజల వద్దకు వెళతామన్నారు. వచ్చే ఐదేళ్లు దేశానికి రాబోయే వెయ్యి సంవత్సరాల అభివృద్ధికి సరిపడా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేశామన్నారు. శ్రేయస్సు, సర్వతోముఖాభివృద్ధి, ప్రపంచ నాయకత్వ దిశగా భారత్‌ను అభివృద్ధి పంథాలో నడిపిస్తామన్నారు. మరోసారి మోదీ సర్కార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.

రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇదే చివరి అవకాశం : ఖర్గే
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు ఇదే చివరి అవకాశమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్వేషం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దేశ ప్రజలందరూ కలిసి పోరాడతారని వెల్లడించారు. భారత్‌లో న్యాయానికి ఈ ఎన్నికలు తలుపులు తెరుస్తాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి కాపాడుకోవడానికి బహుశ ఇదే చివరి అవకాశం కావచ్చన్నారు.

'హాత్‌ బద్లేగా హలాత్‌ ' అంటూ ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల బాండ్లు, జాతీయ ప్రతిపక్షాల నిధుల ఖాతాలను స్తంభింపజేయడం వంటి ఎన్నో కుంభకోణాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు ఓ మైలురాయిగా నిలవనున్నట్లు కాంగ్రెస్‌ అధికారక ప్రతినిధి పవన్‌ఖేర్‌ తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అత్యంత కీలకమైనవిగా ఖేర్‌ మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగ హోదాను తగ్గించిందని కాంగ్రెస్‌ కొత్త ఎన్నికల కమిషనర్ల ఎన్నికను వ్యతిరేకిస్తూ నోట్‌ ఇచ్చినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో బీజేపీ నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు.

ఎన్నికల రణక్షేత్రంలోకి ఇండియా కూటమి- జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభే ఆరంభంగా!

దేశంలో మోగిన ఎన్నికల నగారా- 7విడతల్లో సార్వత్రిక పోరు- పోలింగ్, కౌంటింగ్ తేదీలివే

Last Updated : Mar 16, 2024, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details