Drugs Seized In Pune : మహారాష్ట్ర పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్ లభ్యమైంది. సుమారు రూ.1,100 కోట్ల విలువైన 600 కిలోల మెఫిడ్రోన్ అనే డ్రగ్‌ను పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైనోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్( ఎన్డీపీఎస్ యాక్ట్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'ఆదివారం నుంచే ఈ ఆపరేషన్ చేపట్టాం. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి తొలుత రూ. 3.85 కోట్ల విలువైన మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ క్రమంలో వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాం. మరో రెండు గోడౌన్లలో 55 కిలోల మెఫిడ్రోన్‌ను జప్తు చేశాం. కుర్కుంభ్ MIDC ప్రాంతంలో మరొక ఆపరేషన్ నిర్వహించి 550 కిలోల డ్రగ్స్‌ను రికవరీ చేశాం. ఇంకా ఈ ముఠా వెనుక ఎవరున్నారనే కీలక విషయాలను రాబడుతున్నాం. అరెస్టైన నిందితులు కొరియర్ బాయ్స్‌గా చలామణి అవుతున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పుణెను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రాధాన్యం' అని పుణె పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు.
డ్రగ్స్ కేసులో యువకుడు అరెస్ట్
నవీ ముంబయిలో 7.5లక్షల రూపాయల విలువైన మెఫిడ్రోన్ డ్రగ్స్ కలిగి ఉన్నాడనే కారణంతో ఓ యువకుడిని అరెస్ట్ చేసింది యాంటీ నార్కోటిక్స్ సెల్(ANC) బృందం. పక్కా సమాచారంతో నిందితుడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? కస్టమర్లకు ఎలా సరఫరా చేస్తున్నాడనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.