Doctor Shot Dead Inside Hospital In Delhi :దిల్లీలో దారుణం జరిగింది. ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్ను కాల్చి చంపారు. కలింది కుంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జైత్పుర్లో ఉన్న నీమ ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని యూనాని ప్రాక్టీషనర్ జావెద్ అక్తర్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయాలతో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చారు. గాయాలకు డ్రెస్సింగ్ చేసిన తర్వాత డాక్టర్ను కలవాలని పట్టుబట్టారు. దీంతో ఆస్పత్రి స్టాఫ్, నిందితులకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వెంటనే వైద్యుడి క్యాబిన్లోకి వెళ్లిన దుండుగులు, అతడిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని హాస్పటల్ స్టాఫ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైనట్లు చెప్పారు.