Politcal Parties Responses On Vijay Party :తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్ తమ సిద్ధాంతాలను కాపీ కొట్టారని తమిళనాడు అధికార డీఎంకే ఆరోపించింది. ఆదివారం విల్లుపురంలో జరిగిన టీవీకే బహిరంగ సభలో ఎంకే స్టాలిన్ కుటుంబంపై విజయ్ పరోక్షంగా ఆరోపణలు చేయగా, వాటిపై స్పందించింది. విజయ్ ఆరోపణలు నిరాధారమైనవని సోమవారం డీఎంకే స్పష్టం చేసింది.
తమ సుదీర్ఘ రాజకీయ కాలంలో ఎందరో ప్రత్యర్థులను ఎదర్కొన్నామని, అయినా బలంగా ముందుకు సాగుతామని డీఎంకే నేత ఇళంగోవన్ తెలిపారు. తమ పార్టీ విధానాలతోపాటు సిద్ధాంతాలను విజయ్ కాపీ చేశారని ఆరోపించారు. ఆయన చెప్పినవి ఇప్పటికే తాము చెప్పామని, ప్రస్తుతం అనుసరిస్తున్నామని తెలిపారు. డీఎంకే నాయకులు ప్రజల సమస్యల కోసం పోరాడుతూ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. డీఎంకే ఎప్పుడూ ప్రజల కోసం పోరాడుతుందని తెలిపారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఉందని విమర్శించారు. తమ పార్టీ నేతల్లా టీవీకే నాయకులు పోరాడలేరని తెలిపారు. డీఎంకేకు, ఇతర పార్టీలకు ఉన్న తేడా అదేనని చెప్పారు.