తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివరాత్రి రోజు చివరి అమృత స్నానం- కుంభమేళాలో ఇసుకేస్తే రాలనంత జనం! - MAHA KUMBH 2025 FINAL SNAN

మహా కుంభమేళా చివరి రోజు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న ప్రజలు- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన యూపీ సర్కార్

Maha Kumbh 2025 Final Snan
Maha Kumbh 2025 Final Snan (PTI)

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 6:56 AM IST

Maha Kumbh 2025 Final Snan :కుంభమేళాలో భాగంగా మహా శివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్‌ 4,500 బస్సులు మోహరించగా ప్రయాగ్‌రాజ్‌ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైల్వేశాఖ 350 రైళ్లు నడుపుతోంది.

భారీ భద్రత
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా తుదిదశకు చేరుకుంది. జనవరి 13న మొదలైన కుంభమేళా మహాశివరాత్రి అయిన బుధవారం ముగియనుండగా మౌనిఅమావాస్య మాదిరిగానే శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. మంగళవారం రాత్రికే సుమారు కోటి మంది భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శివరాత్రి రద్దీ దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీచేశారు. త్రివేణీ సంగమం వద్ద 37వేల మంది పోలీసులు, 14వేల మంది హోంగార్డులను మోహరించారు. పెద్దఎత్తున AI ఆధారిత కెమెరాలు, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా భక్తుల రద్దీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

నో వెహికిల్ జోన్
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాకుంభ్‌నగర్‌ ప్రాంతం మొత్తాన్ని నో వెహికిల్‌ జోన్‌గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచే కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడంలేదు. భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని, ఒకే చోటికి ఎక్కువ సంఖ్యలో తరలిరావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లని సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తైన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ RTCతోపాటు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు UPSRTC 4,500 బస్సులను మోహరించింది. మహాకుంభ్‌నగర్‌ నుంచి సమీపంలోని బస్టాండ్లకు తరలించేందుకు ఉచితంగా 750 షటిల్‌ బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వేశాఖ కూడా భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు 350 రైళ్లు నడుపుతోంది. మౌని అమావాస్య నాడు 360 రైళ్లు నడిపించినట్లు పేర్కొన్న రైల్వేశాఖ ఆ రోజు 20లక్షల మంది యాత్రికులను స్వస్థలాలను సురక్షితంగా చేరవేసినట్లు తెలిపింది. బుధవారం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే ప్రత్యేక బోగీలను ప్రయాగ్‌రాజ్‌ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది.

పూరీ తీరంలో మహాశివరాత్రి సైకత శిల్పం
మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో అద్భుతంగా సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. 144 కుంభాలను, వాటిపై శివలింగాలను అమర్చి అబ్బురపరిచారు.

ABOUT THE AUTHOR

...view details