Delhi Bomb Blast: దిల్లీ రోహిణి ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడుపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఉగ్రకోణంలో ఈ కేసును ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి "జస్టిస్ లీగ్ ఇండియా" అనే టెలిగ్రామ్ ఛానల్‌పై దిల్లీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఛానెల్ వివరాలు ఇవ్వాలని టెలిగ్రామ్ సంస్థకు దిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను కూడా పోలీసులు కోరారు.
సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద బాంబు పేలుడు ఘటన వివరాలను సీసీటీవీ ఫుజేజీతో సహా "జస్టిస్ లీగ్ ఇండియా" టెలిగ్రాం ఛానల్లో ప్రసారం చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులను మట్టుబెట్టడానికి భారత ఏజెంట్లు చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపినట్లు జస్టిస్ లీగ్ ఇండియా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. 'కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరుమూయించాలని చూస్తే, ప్రపంచంలో వారే మూర్ఖులు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్' అనే సందేశాన్ని ‘జస్టిస్ లీగ్ ఇండియా' అని పోస్టులో ఉంది. దీంతో పేలుడు ఘటనలో ఖలిస్థానీ కోణంపై దర్యాప్తు చేయాలని టెలిగ్రామ్‌కు దిల్లీ పోలీసులు లేఖ రాశారు.