Hyundai India Share Price Listing : హ్యుందాయ్ మోటార్స్ ఇండియా షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లో నమోదయ్యాయి. మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఐపీఓ 1% డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
మదుపరులకు షాక్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు అనుబంధ సంస్థయే ఈ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా. ఈ షేర్ గరిష్ఠ ఇస్యూ ధర రూ.1960 ఉండగా, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ బీఎస్‌ఈలో 1.47శాతం డిస్కౌంట్‌తో రూ.1931 వద్ద లిస్ట్ అయ్యింది. తరువాత ఈ స్టాక్ కాస్త రికవరీ అయ్యి రూ.1968కి పెరిగినప్పటికీ, తరువాత క్రమంగా రూ.1846కు (6% నష్టం) పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీలో ఈ హ్యుందాయ్ షేర్ రూ.1934 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే 1.32 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యింది. తరువాత దీని ధర రూ.1844.65 (5.88 శాతం)కి పడిపోయింది. దీనితో లిస్టింగ్ గెయిన్స్ పొందాలని ఆశించిన మదుపరులకు షాక్ తగిలినట్లు అయ్యింది.
#WATCH | Mumbai: Hyundai Motor India Limited gets listed on the National Stock Exchange (NSE). pic.twitter.com/xwv5CzzZzT
— ANI (@ANI) October 22, 2024
ఐపీఓ డీటైల్స్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 17న ముగిసింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చింది. సంస్థాగత మదుపరుల అండతో, ఇది 2.37 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. దీనితో ఇప్పటి వరకు ఎల్‌ఐసీనే (రూ.21,000 కోట్లు) అతిపెద్ద ఐపీఓగా ఉండగా, హ్యుందాయ్ మోటార్స్ దాన్ని అధిగమించింది.
హ్యుందాయ్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతానికి రూ.1,57,807.67 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ 1996 నుంచి భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇది అన్ని సెగ్మెంట్లలో కలిసి 13 రకాల కార్ మోడల్స్‌ను విక్రయిస్తోంది.
స్టాక్ మార్కెట్ టుడే
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడం వల్ల మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 450 పాయింట్లు కోల్పోయి 80,701 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 24,625 వద్ద కొనసాగుతోంది.