Aadhar Card Morphing Cyber Crimes : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీ (డీస్ప్లే పిక్చర్)లు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.కోట్లు అపరిచిత వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. కొరియర్ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ ఫోన్ చేసి మరీ బెదిరించి అన్యాయంగా డబ్బులు గుంజుతున్నారు. తాజాగా మరో రకమైన దోపిడీకి తెరలేపారు. ఏకంగా ఫొటో మార్ఫింగ్ చేసి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని ఓ రైతుకు ఈ ఘటన ఎదురైంది. ఆధార్, పాన్‌కార్డుల్లోని తన ఫొటోలను మార్ఫింగ్ చేసి కొంతమంది బ్యాంకులో రూ.20 లక్షల రుణం తీసుకున్నారని ఓ బాధితుడు సోమవారం జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన రైతు ముంజాల నారాయణ జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో పంట రుణం కోసం వెళ్లారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు: పంట రుణం కావాలని బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా, బ్యాంకు అధికారులు మీ పేరు మీద హైదరాబాద్‌లో ఏడు ప్రైవేటు బ్యాంకుల్లో సుమారు రూ.20 లక్షల రుణం ఉన్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆయా బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా, తన ఆధార్, పాన్‌కార్డుల్లోని ఫొటోలను మార్చి రుణం తీసుకున్నట్లు తేలింది. ఈ ఘటనపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరారు.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ఇదే క్రమంలో ఆ రైతు రుణం వస్తుందేమే అనే ఆశతో బ్యాంకుకు వెళితే ఈ విషయం బయట పడింది. ముంజాల నారాయణ అనే రైతుకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
డబ్బులు పోతే వెంటనే ఇలా చేయండి : సైబర్ నేరస్థులు సొమ్ములు కొట్టేస్తే, భయపడకుండా సత్వరమే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెనక్కి తీసుకొస్తుంది. మోసం జరిగిన తర్వాత ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే మన డబ్బులు మనకు వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? - ఐతే మీ ఖాతా ఖల్లాస్