Delhi Assembly polls Kejriwal Nomination : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఒకరు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాగా, మరొకరు బీజేపీ నేత పర్వేశ్ వర్మ. ఈ ఇద్దరు నేతలు న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం తన భార్య సునీతా, ఆప్ నేతలతో కలిసి హనుమాన్ ఆలయం, వాల్మీకి మందిర్‌కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆప్ కార్యాలయం నుంచి జిల్లా మేజిస్ట్రేట్ వరకు పాదయాత్రను నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మళ్లీ దిల్లీలో ఆప్ ప్రభుత్వమే వస్తుందని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి మెజారిటీతో తమ పార్టీ గెలుస్తుందని ఆయన అన్నారు.
బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ సైతం నామినేషన్ వేయడానికి తన అనుచరులతో కలిసి పాదయాత్రగా తరలివెళ్లారు. దిల్లీలోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీనిపై పర్వేశ్ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. 'నేను ఎన్నికల కోసం నామినేషన్ సమర్పించాను. దేవుడు, తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలు, అగ్ర నాయకుల ఆశీస్సులతో ఈ ప్రక్రియను పూర్తి చేశాను. ప్రజలు నాతోనే ఉన్నారు' అని ట్వీట్‌లో పర్వేశ్ వర్మ రాసుకొచ్చారు.
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. 2013 నుంచి న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో గెలుస్తూ వస్తున్న కేజ్రీవాల్‌కు ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు బలమైన నేతల నుంచి టఫ్ ఫైట్ ఎదురవుతోంది.
కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్
మరోవైపు దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. దిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో గత సంవత్సరమే కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. దాని ప్రాతిపదికన కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కావాలని కేంద్ర హోంశాఖను ఈడీ అభ్యర్థించింది. ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి అనుమతి మంజూరు కావడం గమనార్హం.
2021-22లో జరిగిన దిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే అని ఈడీ వాదిస్తోంది. ఈ స్కాం ద్వారా వచ్చిన నిధులను ఆప్ పార్టీ కార్యకలాపాల కోసం ఆయన వాడుకున్నారని అంటోంది. మనీలాండరింగ్ ద్వారా వచ్చిన నిధులను ఒక కంపెనీలా ఆప్ పార్టీ వాడుకుందని గతంలో ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ సీఎంగా వ్యవహరించిన సమయంలో మంత్రులుగా ఉన్న పలువురి ఆప్ సీనియర్ నేతల పేర్లను కూడా ఈ స్కాం కేసులో ఈడీ పొందుపరిచింది. తొలుత లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు చేశారు. తదుపరిగా ఈడీ కూడా మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 2022 ఆగస్టు 22న కేసును నమోదు చేసింది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను ప్రాతిపదికగా తీసుకొని ఈడీ దర్యాప్తును మొదలుపెట్టింది.