తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం- దానిని దెబ్బతీసేందుకు విషబీజాలు: మోదీ - MODI CONSTITUTION DEBATE LOK SABHA

భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి - ఇవి యావత్‌ దేశం గర్వపడే క్షణాలు: ప్రధాని మోదీ

MODI
MODI (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 6:53 PM IST

Updated : Dec 14, 2024, 7:47 PM IST

Modi Constitution Debate Lok Sabha : భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు.

"దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవం దక్కాలి. మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు" అని మోదీ అన్నారు.

ఉపాధిని వెతుక్కుంటూ పేదలు పలు ప్రాంతాలకు వెళ్తారని, పేదలకు ఇబ్బంది లేకుండా 'వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ కార్డ్‌' విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. "పేదలు ఎక్కడున్నా రేషన్‌ సులువుగా తీసుకోలగాలి. ఆయుష్మాన్‌ కార్డు ద్వారా ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నాం. డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించింది. రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యపడుతుంది" అని మోదీ అన్నారు.

అంతా కాంగ్రెస్‌ వల్లే!
"మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించింది. భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదు. రాజ్యాంగ శక్తి, ప్రజల ఆశీర్వాదం మాకున్నాయి. మా పరిపాలన చూసి ప్రజలు మూడు సార్లు మాకు అధికారం ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు అండగా నిలిచారు. ఈ దేశాన్ని ఒకే కుటుంబం 55 ఏళ్లపాటు పాలించింది. ఆ కుటుంబం ఈ దేశానికి అనేక విధాలుగా నష్టం కలిగించింది. 1947 నుంచి 1952 వరకు ఎన్నికైన ప్రభుత్వం మనకు లేదు. ఆ సమయంలో ఆ కుటుంబం ఈ దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు. ఆయన తప్పు చేస్తున్నారని అప్పటి స్పీకర్ రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారు. ఎంతోమంది పెద్దలు సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేకసార్లు ప్రయత్నించారు" అని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రజల హక్కులు హరించారు
"ఆనాటి కాంగ్రెస్‌ నేతలు రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారు. వేలాది మందిని జైళ్లకు తరలించారు. కోర్టుల నోరు, పత్రికల గొంతు నొక్కేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిని కూడా అడ్డుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు పన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలు అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఇదే కాంగ్రెస్‌ పాలన తీరుకు నిదర్శనం" అని మోదీ విమర్శలు గుప్పించారు.

Last Updated : Dec 14, 2024, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details