Jharkhand Polls Congress Manifesto: ఝార్ఖండ్ తొలిదశ ఎన్నికలకు ఒక రోజు ముందు మేనిఫెస్టోను విడుదుల చేసింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, 250 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. 7 గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో చైర్మన్ బంధు తిక్రీ దీనిని మంగళవారం విడుదల చేశారు.
ఒక సంవత్సరంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ బంధు తిక్రీ పేర్కొన్నారు. 1932 ఖతియాన్ విధానం, సర్న ధర్మ కోడ్ అమలతో పాటు ఏడు అంశాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు.
ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకుగాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఎస్టీలకు 28 శాతం, ఎస్సీలకు 12 శాతం, ఓబీసీలకు 27 శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది. యువతకు 10 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అన్ని బ్లాకుల్లో డిగ్రీ కళాశాలను, ప్రతి జిల్లాలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు నిర్మిస్తామని తెలిపింది. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. రైతులకు వరిపై కనీస మద్దతు ధరను రూ.3,200 వరకు, ఇతర పంటలపై 50 శాతం వరకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న 43 స్థానాలకు, 20న మిగతా నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్స్ కౌంటింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.