Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా- బీజాపుర్‌లో సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో రాయ్‌పుర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
సైనికులపై నక్సల్స్ కాల్పులు
Encounter In Chhattisgarh :ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ సైనికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతమని చెప్పారు. టేకులగూడ క్యాంపు నుంచి భద్రతా దళాలు ఎప్పటిలాగే మంగళవారం కూడా కూంబింగ్‌కు వెళ్లాయని పేర్కొన్నారు. టేకులగూడలో నక్సలైట్లను ఏరిపారేసేందుకు సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి భద్రతా బలగాలు. సైనికుల శిబిరం అక్కడ ఉన్నప్పటి నుంచి నక్సల్స్ దాడులు కొంతమేర తగ్గాయి. కాగా, నక్సల్స్ ప్రాంతాలుగా ఉన్న జోనగూడ- అలీగూడ ప్రాంతాలకు కూంబింగ్‌కు వెళ్లాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో వారిపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. భద్రతా దళాలు సైతం ధీటుగా స్పందించాయి. నక్సల్స్, భద్రతా దళాలు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు.