Chhattisgarh Encounter Today :ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరగ్గా, పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ బృందం తనిఖీలు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
భేజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఉదయం భద్రతా సిబ్బంది, యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు. కొరాజ్‌గూడ, దంతేస్‌పురం, నాగారం, భండరపదర్ గ్రామాల అటవీ కొండలపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. INSAS రైఫిల్, AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR) సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సెర్చ్ ఆపరేషన్ ఇంకా ఆ ప్రాంతంలో కొనసాగుతోందని ఆయన తెలిపారు.
మరోవైపు, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి భద్రతా దళాలను ప్రశంసించారు. బస్తర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం, అభివృద్ధిని సులభతరం చేయడం, పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. సుక్మా సహా బస్తర్ ప్రాంతంలో శాంతి యుగం తిరిగి వచ్చిందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల నిర్మూలన ఖాయమని తెలిపారు. మార్చి 2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లను నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. 2024లో ఇప్పటివరకు 207 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.