తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోయిస్ట్​ టాప్ లీడర్స్​పై ఫోకస్​- నెక్స్ట్ టార్గెట్ వారే- సీక్రెట్ ఆపరేషన్స్ షురూ! - ENCOUNTER MAOIST TOP LEADERS KILLED

దేశంలో మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం- సరైన శిక్షణ, మెరుగైన నిఘాతోపాటు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారంత నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు- భారీ రివార్డులు ఉన్న మావోయిస్టు నేతలపై నిఘా

Etv Encounter Maoist Top Leaders Killed
Encounter Maoist Top Leaders Killed (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 4:42 PM IST

Encounter Maoist Top Leaders Killed : వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన నేపథ్యంలో భద్రతాదళాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఉద్ధృతం చేశాయి. ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జయరాంరెడ్డి అలియాస్‌ చలపతిని హతమార్చిన తర్వాత ముగ్గురు అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలైన నంబాల కేశవరావు, మాడ్వి హిడ్మా, గణపతిపై భారీ రివార్డులు ఉన్నాయి. నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌పై కోటిన్నర, మాడ్వి హిడ్మాపై రూ.కోటి, గణపతిపై రెండున్నర కోట్ల రూపాయల రివార్డ్‌ ఉంది.

హస్య ప్రాంతాల నుంచి ఆపరేషన్లు
మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత గణపతి 2018లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ నక్సల్స్‌ ఉద్యమంపై ఆయన ప్రభావం, ప్రమేయం ఉన్నట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉన్న బసవరాజ్‌ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఏ పెద్దఎత్తున గాలిస్తోంది. భద్రతాదళాల కన్నుగప్పి తిరుగుతున్న ఆయన రహస్య ప్రాంతాల నుంచి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

స్థావరాలను గుర్తించటమే లక్ష్యంగా!
కేంద్ర భద్రతాదళాల జాబితాలో అనేకమంది మావోయిస్టు నేతలు ఉన్నప్పటికీ కేశవరావు, హిడ్మా, గణపతిని పట్టుకునేందుకు అధికప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మిగతా మావోయిస్టు అగ్రనేతలు కూడా భద్రతా దళాల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్థావరాలను గుర్తించటమే లక్ష్యంగా భద్రతాదళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహా మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఫార్వర్డ్‌ పోస్టులు ఏర్పాటు చేశాయి.

మల్లోజుల వేణుగోపాల్‌, కటకం సుదర్శన్‌, మిసిర్‌ బిస్రా అలియాస్‌ భాస్కర్‌, ప్రయాగ్‌ మాంఝీ అలియాస్‌ వివేక్‌, ఆసిం మండల్‌ అలియాస్‌ ఆకాశ్‌, పతిరామ్‌ మాంఝీ మావోయిస్టు పార్టీలో ఇతర ముఖ్యనేతలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా భద్రతాదళాల మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నారు. మిసిర్‌ బిస్రా, ప్రయాగ్‌ మాంఝీ, ఆసిం మండల్‌, పతిరామ్ మాంఝీలపై కోటి రూపాయల చొప్పున రివార్డ్‌ ఉంది. వారిపై ఝార్ఖండ్‌ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.

విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా!
గగన్నగా పిలిచే నంబాల కేశవరావు గతంలో మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌గా ఉన్నారు. 2018లో గణపతి రాజీనామా చేసిన తర్వాత కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేట్‌కు చెందిన కేశవరావు మాజీ కబడ్డీ క్రీడాకారుడు. వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 1955లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు.

1980లో విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆయన ఒకసారి అరెస్టయ్యారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరిగా హిడ్మా గుర్తింపు పొందారు. 1981లో ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ సుక్మా జిల్లాలో ఆయన జన్మించారు. హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అని కూడా ఆయన్ని పిలుస్తారు. పదో తరగతి తర్వాత నక్సల్స్‌ ఉద్యమంలో చేరిన హిడ్మా, కొద్దికాలంలోనే మిలిటరీ ఆపరేషన్లు, గెరిల్లా పోరాటాల్లో ప్రధాన వ్యూహకర్తగా మారారు. మావోయిస్టు పార్టీ అతివాద నేతల్లో ఒకడిగా గుర్తింపు పొందారు.

2013లో దర్భావ్యాలీలో జరిగిన నక్సల్స్‌ దాడి సహా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మా హస్తమున్నట్లు తెలుస్తోంది. 2010లో దంతేవాడ, 2017లో సుక్మా జిల్లాల్లో భద్రతాదళాలు లక్ష్యంగా జరిగిన నక్సల్స్‌ దాడుల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన గణపతి 1949లో కరీంనగర్‌ జిల్లా సారంగాపుర్‌లో జన్మించారు.

ఆ సమయంలో నక్సల్స్‌తో పరిచయం
దేశంలో నక్సల్స్‌ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుల్లో ఆయన ఒకరు. సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన గణపతి బీఈడీ కూడా పూర్తిచేశారు. నక్సల్స్ ఉద్యమంలో చేరటానికి ముందు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉన్నత చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన గణపతి వరంగల్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో నక్సల్స్‌తో పరిచయం ఏర్పడింది. వారి సిద్ధాంతాలకు ఆకర్షితుడైన గణపతి తర్వాత ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన గణపతిని ముప్పాల లక్ష్మణరావు అలియాస్‌ శ్రీనివాస్‌ అని కూడా పిలుస్తారు.

ఆరోగ్య సమస్యలతో నేపాల్‌లో ఆశ్రయం!
మావోయిస్టు పార్టీ ముగ్గురు అగ్రనేతల కోసం భద్రతాదళాలు గాలింపు తీవ్రతరం చేశాయి. మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అణువణువూ జల్లెడ పడుతున్నాయి. నంబాల కేశవరావు ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నంబాలపై ఛార్జ్‌షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ పరారీలో ఉన్న నేరస్థుడని ప్రకటించింది. హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి తప్పుకున్న గణపతి ఆరోగ్య సమస్యలతో నేపాల్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం నక్సల్స్‌ వ్యతిరేక కార్యకలాపాలపై గతంలో కూంబింగ్‌ ఆపరేషన్లలో పనిచేసిన మాజీ పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రతాదళాలు భారీ విజయాలు సాధిస్తున్నాయని, ఇదే స్థాయిలో ఆపరేషన్లు కొనసాగితే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే రోజు ఎంతో దూరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు హతం కావటం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. స్థానికంగా మద్దతు లభించకపోవటం, కొత్త నియామకాలు తగ్గిపోవటం వంటి సమస్యలు మావోయిస్టులకు ప్రతికూలంగా మారినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతోపాటు భద్రతాదళాలకు సరైన శిక్షణ, మెరుగైన నిఘా వంటి చర్యలు నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లు విజయవంతం కావటానికి సహాయ పడుతున్నాయని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details