Centre Conspiring To Kill Kejriwal :కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన ఆరోపణలు చేసింది. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించింది. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందని తెలిపింది. శుక్రవారం దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే ఈ అంశంపై స్పందించాలని, కేజ్రీవాల్‌కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించి, పారదర్శకతను చాటుకోవాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించే రీతిలో ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'అమిత్ షా కనుసన్నల్లో'
"దిల్లీ పోలీసులు బీజేపీకి చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తున్నారు. కేజ్రీవాల్‌పై పదేపదే దాడులు జరుగుతున్నా వారు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే వారిపై మా పార్టీకి నమ్మకం లేదు" అని ఆతిశీ, మాన్ ఆరోపించారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని వెల్లడించారు. "కేజ్రీవాల్‌పై వరుస దాడులు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబరులో కూడా ఆప్ అధినేతపై కొందరు దాడి చేశారు. మేం దర్యాప్తు చేయగా ఆ దాడికి పాల్పడిన వారు బీజేపీ కార్యకర్తలని తేలింది. పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు" అని ఆతిశీ ఆరోపించారు. "దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్‌కు భద్రత లేకుండా చేసింది" అని దిల్లీ, పంజాబ్ సీఎంలు అన్నారు.