Census Of India : జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఈ ప్రక్రియ 2026 వరకు జరగనుందని తెలుస్తోంది. 2026 ఏడాది చివర్లో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అయితే వచ్చే ఏడాది జరిగే జనగణనతో భవిష్యత్ సెన్సస్ సైకిల్స్ మారే అవకాశం ఉంది. అంటే ఈ జనగణన 2025-2035 కాలానికే చేపడితే, వచ్చేసారి 2035-2045 కాలానికి లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, కులగణనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
జనాభా లెక్కలు- 31 ప్రశ్నలు
ఈ సారి జనగణనలో ప్రజలను అడిగే 31 ప్రశ్నలను రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. క్రితం సారి జనాభా లెక్కింపులో అడిగినట్లు కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారా కాదా అని అడుగుతారు. కుటుంబంలో నివసించే వ్యక్తుల సంఖ్య, కుటుంబ పెద్ద మహిళా కాదా, ఇంట్లో నివాసం ఉండే గదుల సంఖ్య, కుటుంబంలో పెళ్లైన జంటల సంఖ్య వంటి ప్రశ్నలు అడుగుతారు. వీటితో పాటు కుటంబానికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొలైల్/స్మార్ట్‌ఫోన్, సైకిల్, స్కూటర్ లేదా మోటార్ సైకిల్, మోపెడ్, కారు, జీప్ లేదా వ్యాన్ వంటి వాహనాలున్నాయా అనే ప్రశ్నలు అడుగుతారు.
జనాభా లెక్కల్లో అడిగే మరికొన్ని ప్రశ్నలు
- ఇంట్లో తినే తృణధాన్యాలు ఏమిటి
- తాగునీటికి ప్రధాన వనరుల వివరాలు
- ప్రధాన లైటింగ్ సోర్స్ వివరాలు
- మరుగుదొడ్లు, మరుగుదొడ్డి రకం
- వ్యర్థ జలాల నిర్వహణ సౌకర్యం, స్నానపు సౌకర్యాల లభ్యత
- వంటగది, LPG/PNG కనెక్షన్ లభ్యత, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం
- రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ లభ్యత మొదలైనవి.
లోక్‌సభ స్థానాల పునర్విభన- దక్షిణాది ఆందోళన?
జనగణన తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విజయం సాధించినందున, తమ రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశ రాజకీయాల్లో దక్షిణాదికి ప్రాధాన్యం తగ్గుతుందని వారు భావిస్తున్నారు.
కులగణనకు విపక్షాల పట్టు
అయితే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈసారి జరగనున్న జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందా లేదా, లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు ఈ లెక్కలు ఉపయోగిస్తారా లేదా అని అంశాలపై కాంగ్రెస్ స్పష్టత కోరింది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రానికి సోమవారం సూచించింది.
ఈ కొత్త సెన్సస్‌లో 1951 నుంచి ప్రతి సెన్సస్‌లో అడుగుతున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతోపాటు దేశంలోని అన్ని కులాల వివరణాత్మక గణన కూడా ఉంటుందా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ప్రకారం, అలాంటి కులగణన చేపట్టడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు.
దేశంలో జనగణన ప్రతి పదేళ్లకొకసారి ఆనవాయితీగా నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా 2021లో ఆగిన జనగణన- ఆ తర్వాత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వేర్వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల నీతి ఆయోగ్ లెక్కలు వెల్లడించాయి. సరైన గణాంకాలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన- 3లక్షల మందికి ప్రత్యేక శిక్షణ, 12నెలల పాటు ప్రక్రియ!