CBSE 12th result 2024 declared :విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల ఫలితాలు వచ్చేశాయ్. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చని సీబీఎస్‌ఈ వెల్లిడించింది. రోల్ నంబర్, స్కూల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్ చూసుకోవచ్చని చెప్పింది.
2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు
పదో తరగతిలో మొత్తం 93.60శాతం మంది పాస్ అయ్యారు. 2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సీబీఎస్‌ఈ వెల్లడించింది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారని చెప్పింది. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారని తెలిపింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30శాతం, బెంగళూరులో 99.26శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
అమ్మాయిలే టాప్
ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98 శాతం మంది పాస్ అయ్యారు. 91శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు రాణించారు. 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వివరించింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించింది.
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్
సీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలె కసరత్తు ముమ్మరం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్‌ఈని సీబీఎస్‌ఈని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని చెప్పాయి.
వచ్చే నెలలోనే సంప్రదింపులు!
ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసేందుకు విధివిధానాలు రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.