తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-సేవ చేయాలని లేదా? - ఐఏఎస్​లను ప్రశ్నించిన క్యాట్​ - IAS OFFICERS NO RELIEF

ఐఏఎస్‌ల అభ్యర్థనపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన క్యాట్ - హైకోర్టును ఆశ్రయించనున్న ఐఏఎస్​లు

IAS OFFICERS NO RELIEF
IAS OFFICERS NO RELIEF (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 5:17 PM IST

Updated : Oct 15, 2024, 6:02 PM IST

NO RELIEF TO IAS OFFICERS IN CAT: డీఓపిటి ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డివోపిటికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చేనెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఐదవ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను క్యాట్ ఆదేశించింది.

ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన IAS అధికారులు వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్‌రాస్, జి. సృజనలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో ఊరట లభించలేదు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్‌ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా?’’ అని క్యాట్‌ ప్రశ్నించింది.

వన్ మ్యాన్‌ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్‌ అధికారుల తరఫు న్యాయవాది క్యాట్‌ దృష్టికి తెచ్చారు. సింగిల్‌మెన్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ తెలంగాణకు రావాల్సి ఉంది.

ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదిలావుంటే క్యాట్‌ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ ఐఏఎస్‌ అధికారుల తరపున న్యాయవాదులు తెలిపారు.

ఇదీ వివాదం :ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య విభజిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు రిలీజ్​ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్​ కుమార్, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్​లు అంజనీ కుమార్, సంతోశ్​ మెహ్రా, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని ఆంధ్రాకు కేటాయించారు. ఐఏఎస్ కేడర్​కు చెందిన అధికారులు అనంతరాము, సృజన గుమ్మిళ్ల, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సి.హరి కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్​ను తెలంగాణకు కేటాయించారు.

విభజన తీరుపై అబ్జెక్షన్​ చేస్తూ వీరందరూ 2014లో క్యాట్​ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోశ్​ మెహ్రా తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ సెంట్రల్​ గవర్నమెంట్​ పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

'సొంత రాష్ట్రాలకు వెళ్లండి' - ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ సహా పలువురి అభ్యర్థనలు తోసిపుచ్చిన కేంద్రం

Last Updated : Oct 15, 2024, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details