Union Cabinet Meeting Highlights :దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విద్య, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వాహణ, డిజిటలైజేషన్, పాడిపరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలే లక్ష్యంగా ఈ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
కేంద్రం ఆమోదించిన పథకాల వివరాలు :
- డిజిటల్ అగ్రికల్చర్ మిషన్- రూ.2,817 కోట్లు
- క్రాప్ సైన్స్ పథకం- రూ.3,979 కోట్లు
- వ్యవసాయ విద్యా రంగం బలోపేతం- రూ. 2,291 కోట్లు
- పాడిపశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పథకం- రూ. 1,702
- హార్టికల్చర్ అభివృద్ధి- రూ.860 కోట్ల
- కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం- రూ. 1,202 కోట్లు
- సహజ వనరుల నిర్వహణ- రూ. 1,115 కోట్లు
ముంబయి, ఇండోర్ మధ్య కొత్త రైలు మార్గం
ముంబయి, ఇందౌర్ మధ్య 309 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028-29నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఉజ్జయిన్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్ ఆలయం సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైలు మార్గం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో 30 కొత్త రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.