How To Make Cabbage Vada Recipe : కొంతమందికి క్యాబేజీ వాసన అస్సలు నచ్చదు. ముఖ్యంగా కొందరు పిల్లలు క్యాబేజీని చూస్తే చాలు ముఖం తిప్పుకుంటుంటారు. అంతేకాదు.. దాంతో ఎంతటి రుచికరమైన కూరలు, ఫ్రైలు చేసిన కూడా తినడానికి ఇష్టపడరు. కానీ, క్యాబేజీలో బోలెడు పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. మరి మీ పిల్లలు కూడా క్యాబేజీతో చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడట్లేదా? అయితే, అలాంటివారికి ఓసారి ఈ క్యాబేజీ(Cabbage)వడలను ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. పైగా వీటిని చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు! మరి ఈ క్యాబేజీ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తయారీకి కావాల్సినవి :
- శనగపప్పు - ముప్పావు కప్పు
- క్యాబేజీ తురుము - రెండున్నర కప్పులు
- బియ్యప్పిండి - మూడు చెంచాలు
- పచ్చిమిర్చి - రెండు
- అల్లం తురుము - చెంచా
- గరంమసాలా పొడి - చెంచా
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు, కారం - రుచికి సరిపడా
- కొత్తిమీర, పుదీనా తరుగు - కట్టచొప్పున
- నూనె - వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత
రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ - నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!
తయారీ విధానం :
- క్యాబేజీ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అయితే.. క్యాబేజీని తరుక్కోవడానికి ముందుగా దాన్ని మరిగే నీటిలో ముంచి తీయాలి. ఇలా చేయడాన్ని బ్లాన్చింగ్ అని అంటారు. వేడి తగ్గాక దాన్ని సన్నగా తరుక్కోవాలి.
- అదే విధంగా పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకులను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం తురుముతో పాటు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే ఇందులో నానబెట్టిన శనగపప్పులో పావు వంతు పప్పుని యాడ్ చేసుకోవాలి.
- తర్వాత మిగిలిన శనగపప్పును నీళ్లు వేయకుండా రుబ్బుకొని.. పైన తయారు చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి.
- ఆ తర్వాత ఇందులో చెంచా గరంమసాలా పొడితో పాటు తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- మిశ్రమంలో క్యాబేజీ కలిపిన తర్వాత నీళ్లు ఊరి పిండి పల్చన అవుతుంది. అప్పుడు తగినంత బియ్యప్పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై ఒక పాన్ పెట్టుకొని అందులో వడలు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న వడల్లా తయారు చేసుకొని వేసుకోవాలి.
- అలా వేసుకున్నాక వడలను రెండు వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే.. నోరూరించే క్రిస్పీ క్రిస్పీగా ఉండే క్యాబేజీ వడలు రెడీ!
- ఇందులో అల్లం, గరంమసాలా, పుదీనా, కొత్తిమీర ఉండటం వల్ల క్యాబేజీ వాసన ఏమాత్రం తెలియదు.
- కాబట్టి క్యాబేజీ అంటే.. ఇష్టపడనివారు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
సాయంత్రం వేళ - కరకరలాడే "చైనీస్ భేల్ పూరి" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! పైగా టేస్ట్ సూపర్!