Butter Chicken Origin Issue In India : దేశంలో ప్రసిద్ధి గాంచిన 'బటర్ చికెన్', 'దాల్ మఖానీ' వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుతోంది. దిల్లీకి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్‌ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ దిల్లీ హైకోర్టును అశ్రయించింది దర్యాగంజ్. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొన్నారు. దీని వల్ల తమ రెస్టారెంట్ గౌరవానికి భంగం కలిగిందని వివరించారు.
'బటర్ చికెన్‌ను కనుగొన్నది మా వాళ్లే'
మరోవైపు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోతీ మహల్ యజమానులను జస్టిస్ సంజీవ్ నరులా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ 'బటర్ చికెన్', 'దాల్ మఖానీ' వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్ యజమానులు జవరిలోనే కోర్టును అశ్రయించారు. ఇక అప్పటి నుంచే ఈ అంశంలో వివాదం మొదలైంది.