Boy Trapped Leopard :మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలుడు తన తెలివితో ఏకంగా చిరుతపులినే గదిలో బంధించాడు. మాలెగావ్ పట్టణంలో మోహిత్ విజయ్ అనే పిల్లాడు తన ఇంట్లోని ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని మొబైల్ ఫోన్లో ఆడుకుంటున్నాడు. అంతలోనే అతడు కూర్చున్న గదిలోకి అకస్మాత్తుగా ఓ చిరుతపులి ప్రవేశించింది. ఆ చిరుతను చూసిన పిల్లాడు ఏ మాత్రం భయపడకుండా సెకన్ల వ్యవధిలోనే ఆ గది నుంచి బయటకు వెళ్లి చిరుత బయటకు రాకుండా తలుపు వేశాడు.
అనంతరం తల్లిదండ్రుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ చిరుతకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. అయితే చిరుతను చూసి అస్సలు భయపడకుండా దానిని బంధించేందుకు మోహిత్ విజయ్ ప్రదర్శించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తల్లి ఏనుగు లేదని పిల్ల ఏనుగు మారం!
అనారోగ్యం కారణంగా మరణించిన తన తల్లి ఏనుగును విడిచిపెట్టలేక వేరే ఏనుగుల గుంపులో కలవడానికి నిరాకరించింది రెండు నెలల ఆడ ఏనుగు. చివరకు అటవీ శాఖ అధికారులు, జంతు వైద్యుల చొరవతో అది కొత్త ఏనుగు గుంపులో కలిసిపోయింది. ఈ అరుదైన ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది.
తమిళనాడులోని సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లోని బన్నారి అటవీ ప్రాంతంలో ఓ తల్లి ఏనుగు పలు అనారోగ్య సమస్యలతో మంగళవారం మృతి చెందింది. అయితే అంతకుముందు అనారోగ్యం బారిన పడ్డ ఆ ఏనుగుకు చికిత్స అందించి బతికించాలని వైద్యుల బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, చనిపోయిన తల్లి ఏనుగు ఒక రెండు ఏనుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో మగ ఏనుగు ఆడ ఏనుగు కంటే వయసులో 34 నెలలు పెద్దది.