Boxer Vijender Singh Join BJP : బాక్సింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం అందించిన విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర బీజేపీ అభ్యర్థి, సినీనటి హేమమాలినిపై పోటీగా విజేందర్‌ను దింపనుందని ఇటీవలే ఉహాగానాలు వచ్చాయి. విజేందర్ ఇప్పుడు బీజేపీలోకి చేరడం వల్ల వాటికి తెరపడింది.
తిరిగి సొంతింటికి వచ్చా!
దేశ ప్రజల కోసమే బీజేపీలోకి చేరినట్లు విజేందర్ సింగ్ తెలిపారు. ' ఇది నాకు తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉంది. దేశ ప్రయోజనాలకు కోసమే బీజేపీలో చేరాను. మరింత ఎక్కువ మందికి సాయం చేయాలని అనుకుంటున్నా. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకు గౌరవం పెరిగింది. యూకే, దుబాయ్, ఐర్లాండ్ వంటి దేశాలకు బాక్సింగ్ పోటీలకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు విమానాశ్రయాల్లో కొన్ని సంఘటనలు జరిగేవి. కానీ మోదీ సర్కారు వచ్చిన తర్వాత విదేశాలకు సులువుగా వెళ్లగలుగుతున్నాం. అందుకు క్రీడాకారులు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు' అని విజేందర్ సింగ్ తెలిపారు.
ఊహాగానాలకు బ్రేక్
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ కాంస్య పతకం నెగ్గారు. 2019 ఏప్రిల్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జాట్ వర్గానికి చెందిన విజేందర్‌కు ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అది కూడా సీని నటి హేమమాలినిపై పోటీగా బరిలోకి దించే అవకాశాలున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో విజేందర్ 'ప్రజలు కోరుకుంటే ఎక్కడి నుంచైనా సిద్ధమే' అంటూ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది. ఈలోపే ఉన్నట్టుండి ఆయన పార్టీ మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.