అదేంటి గ్రామంలో ఎక్కడ చూసినా రక్తదానంపై అవగాహన కల్పించేలా బోర్డులు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? బస్టాండ్ కూడా రక్తదాన ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నారా? వీటి వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Blood Donors Village :కర్ణాటక హావేరి జిల్లాలోని జల్లాపుర్ గ్రామంలో 520కుపైగా ఇళ్లు ఉన్నాయి. ప్రతీ ఇంటిలో ఒక రక్తదాత కచ్చితంగా ఉంటారు. అందులో చాలా మంది 10 సార్లు కన్నా ఎక్కువగా రక్తదానం చేశారు. రక్తంతోపాటు ప్లాస్మా, ప్లేట్లెట్స్ను కూడా దానం చేస్తున్నారు. హవేరి జిల్లా ఆస్పత్రిలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలు ఉన్న గ్రామంగా జల్లాపుర్ నిలిచింది.
అప్పుడే నిర్ణయం!
కరోనా మహమ్మారి సమయంలో గర్భిణీలు సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు సకాలంలో రక్తం అందక మరణించారు. ఆ విషయాన్ని గుర్తించిన జల్లాపుర్ గ్రామస్థులు అప్పటి నుంచి రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 'జీవదాని బళగ' పేరుతో గ్రూపుగా ఏర్పడి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రక్తదాన ప్రాముఖ్యాన్ని గ్రామస్థులకు వివరిస్తున్నారు.
"ప్రసవ సమయంలో రక్తం లేకపోవడం వల్ల చాలా మంది గర్భిణీలు మరణించారని తెలుసుకున్నాం. అప్పుడే ఊరి ప్రజలంతా రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాం. 2020లో మొదటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. కరోనా కారణంగా సామాజిక దూరం పాటిస్తూనే 100 యూనిట్ల రక్తాన్ని జాగ్రత్తగా సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపించాం. అప్పటి నుంచి మేం రక్తదానంతో పాటు అవయవ దానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం"