Haryana Elections 2024 BJP Candidates List :మరికొద్ది రోజుల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది! ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 67 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇటీవల పార్టీలోకి చేరిన వారికి కూడా బీజేపీ పోటీ చేసే అవకాశం కల్పించడం గమనార్హం.
తొలి జాబితా ప్రకారం, లాడ్వా నియోజకవర్గం నుంచి సీఎం నాయబ్ సింగ్ సైనీ పోటీ చేయనున్నారు. బద్లీ నుంచి రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధంకర్, అంబాలా కాంట్ నుంచి సీనియర్ పార్టీ నేత అనిల్ విజ్ బరిలోకి దిగనున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన దేవేందర్ సింగ్ బబ్లీ, సంజయ్ కబ్లానా, శ్రుతి చౌధరీ తోహానా, బెరీ, తోషమ్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.
కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కుమార్తె ఆర్తీ సింగ్ రావు అటెలి నుంచి పోటీ చేయనున్నారు. కెప్టెన్ అభిమన్యు, కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్, మాజీ ఎంపీ సునీతా దుగ్గల్ పేర్లు కూడా తొలి జాబితాలో ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణాలో అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఇటీవల అక్టోబర్ 5కు ఈసీ మార్చింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా, జమ్ముకశ్మీర్‌తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది.