తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BJP ఎంపీలపై రాహుల్ గాంధీ దాడి చేశారా? లేదా? అసలేం జరిగింది? - PROTEST AT PARLIAMENT

పార్లమెంట్ ప్రాంగణంలో అధికారపక్ష ఎంపీలను అడ్డుకున్న విపక్ష నేతలు- ఈ క్రమంలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు- రాహుల్ నెట్టేశారని ఆరోపణలు

Parliament protests
BJP MP pratap sarangi , Rahul Gandhi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 1:33 PM IST

Parliament protests BJP MPs Injured :పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ అంబేడ్కర్​పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేడ్కర్​ను కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేశారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్​పుత్ గాయపడ్డారు. రాహుల్ గాంధీయే బీజేపీ ఎంపీలను తోసేశారని అధికార పక్షం ఆరోపించింది.

అసలేం జరిగిందంటే?
అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్​పుత్ కింద పడిపోయారు. దీంతో వీరిద్దరిని హుటాహుటిన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. 'నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్‌ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడటం వల్ల కింద పడిపోయాను. దీంతో గాయపడ్డాను' అని ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు.

'బీజేపీ ఎంపీలు నన్ను బెదిరించారు, నెట్టేశారు'
ఎంపీలను నెట్టివేసిన ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. పార్లమెంట్​లోకి వెళ్తుండగా తనను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, అలాగే బెదిరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే తనను అధికార పక్ష సభ్యులు తనను నెట్టివేశారని ఆరోపించారు.

"జరిగిందంతా కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంట్‌ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్‌ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ, వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే రాజ్యాంగంపై వారు (బీజేపీ) దాడి చేస్తున్నారు. అంబేడ్కర్​ను అవమానించారు. "

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

గాయపడిన ఎంపీలను మోదీ ఫోన్​ కాల్
మరోవైపు పార్లమెంట్ వద్ద జరిగిన ఉద్రిక్తతలో గాయపడి రామ్​మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్​పుత్​కు ప్రధాని మోదీ ఫోన్​ చేసి పరామర్శించారు. వారి ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఎంపీలను కేంద్రమంత్రులు శివరాజ్‌ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

ICUలో చికిత్స
ఎంపీలు సారంగి, ముకేశ్​కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్​ఎంఎల్​ ఆసుపత్రి డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. సృహకోల్పోయిన ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందన్నారు. పరీక్షలు చేశామని లక్షణాల ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు.

'రాహుల్ అబద్దాలు చెబుతున్నారు'
రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీలు నెట్టివేస్తే, అధికార పక్ష ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి ఎలా గాయపడ్డారని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జగదాంబికా పాల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అబద్దాలు చెబుతున్నారని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

'కావాల్సినంత ప్లేస్ ఉంది- అలా వెళ్లొచ్చు కదా'
అలాగే రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపలి వెళ్లడానికి కావాల్సినంత స్థలం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లోద్ జోషి తెలిపారు. కానీ రాహుల్ అలా వెళ్లలేదని ఆరోపించారు. రాహుల్ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రను సైతం నెట్టివేశారని అన్నారు. సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు.

'రాహుల్ బౌతిక హింసకు దిగారు'
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నెట్టివేయడం వల్ల ఇద్దరు అధికార పక్ష ఎంపీలు గాయపడ్డారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్​వాల్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ఎంపీలందరికీ ఉంటుందని, కానీ రాహుల్ గాంధీ భౌతిక హింసకు పాల్పడ్డారని విమర్శించారు. బీఆర్ అంబేడ్కర్​కు కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని ఆరోపించారు. ఆస్పత్రి నివేదిక ప్రకారం ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details