BJP Candidate Wins Unopposed Surat :గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం (ఏప్రిల్ 21) జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు ముగ్గురు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైంది.
ఆ వెంటనే సూరత్ స్థానం నుంచి నామినేషన్లు వేసిన మిగతా 8 మంది అభ్యర్థులంతా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించే బీఎస్పీ తరఫున నామినేషన్ వేసిన ప్యారేలాల్ భారతి కూడా పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యగా సురేశ్ పడసాల అనే వ్యక్తితో నామినేషన్ వేయించినప్పటికీ అది కూడా తిరస్కరణకు గురైంది. సరైన పత్రాలు లేకపోవడం వల్ల దాన్ని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ముకేశ్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
ప్రధాని మోదీకి మొదటి విజయ కమలం
ఈ నేపథ్యంలో ముకేశ్ దలాల్‌ను అభినందిస్తూ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చేతికి మొదటి విజయ కమలాన్ని అందించినందుకు ఆయనను అభినందించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పోస్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి నాంది పడిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం జయభేరీ మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.