Bihar Political Crisis :జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ మహాకూటమికి గుడ్‌బై చెప్పటంగా ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేకుండా కేవలం ఆర్జేడీ మంత్రుల స్థానంలో తమ ఎమ్మెల్యేలను నియమించాలని కమలం పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ, బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల నేతలు విడివిడిగా సమావేశమయ్యారు.
మరోవైపు, పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ నివాసంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అంటే తనకు గౌరవమని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 'చాలా నిర్ణయాలు నీతీశ్ నియంత్రణలో లేవు. 'మహాఘటబంధన్'లోని ఆర్జేడీ మిత్రపక్షాలు ఎప్పుడూ ముఖ్యమంత్రిని గౌరవించేవి. సీఎం నీతీశ్ నాతో పాటు వేదికపై కూర్చొని '2005కి ముందు బిహార్‌లో ఏముంది?' అని అడిగేవారు. నేనెప్పుడూ ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. రెండు దశాబ్దాలుగా కల్పించలేని ఉద్యోగాలు, కులగణన, రిజర్వేషన్ల పెంపు మొదలైనవాటిని మహాఘట్బంధన్ సర్కార్ పూర్తి చేసింది.' అని తేజస్వీ యాదవ్ పార్టీ సమావేశంలో అన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఇండియా కూటమిపై జేడీయూ ఫైర్
బిహార్‌లో ఇండియా కూటమి పతనం అంచున ఉందని, కాంగ్రెస్ పదేపదే నీతీశ్ కుమార్‌ను అవమానించిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. కూటమిలో అగ్రస్థానం కోసం నీతీశ్ కుమార్ ఎప్పుడూ ఆశపడలేదని చెప్పారు. 'ఇండియా కూటమి పతనం అంచున ఉంది. పంజాబ్, బంగాల్, బిహార్‌లో ఇండియా కూటమి దాదాపుగా ముగిసింది. బిహార్ సీఎం పట్నాలో సమావేశం ఏర్పాటు చేసి పలు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటుపై ఎటువంటి సమావేశాలు లేవు.' అని కేసీ త్యాగి తెలిపారు.
నీతీశ్‌కు లేఖ రాసిన ఖర్గే
బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, జేడీయూ అధినేత, సీఎం నీతీశ్‌కుమార్ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారన్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు గానీ, కూటమి నుంచి వైదొలగుతున్నట్టు గానీ స్పష్టమైన సమాచారం లేదన్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష 'ఇండియా కూటమి'లో జేడీయూ బలమైన పార్టీయేనని చెప్పారు. గత రెండు, మూడు రోజులుగా వస్తున్న వార్తలపై నీతీశ్‌కు లేఖ రాశానని, ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించానని ఖర్గే తెలిపారు. నీతీశ్ మనసులో ఏముందో తెలియడం లేదన్నారు. ఆదివారం దిల్లీ వెళ్తున్నట్లు చెప్పిన ఖర్గే బిహార్‌లో జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరించి, స్పష్టత వచ్చిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు.